హీరామండి నిజంగానే ఉందా... ఇంకా అక్కడ అలానే జరుగుతోందా!..

సాధారణంగా కొన్ని సినిమాలు ఒక గ్రామం, పట్టణం లేదా దేశం బ్యాక్‌డ్రాప్‌తో వస్తుంటాయి. ఉదాహరణకు రంగస్థలం సినిమాలో రంగస్థలం అనే గ్రామాన్ని చూపించారు. ఇది ఒక ఫిక్షనల్ విలేజ్. చాలా సినిమాలు ఇలాంటి కల్పిత ప్రదేశాల్లోనే స్టోరీని అల్లేస్తాయి. కానీ కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మాత్రం నిజమైన ప్రాంతాల నేపథ్యంలోనే సాగుతుంటాయి. ఈనెల ప్రారంభంలో రిలీజైన 'హీరామండి’ (Heeramandi) సిరీస్ కూడా ఒక రియల్ ప్లేస్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.

సంజయ్ లీలా బన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించిన ఈ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌ సిరీస్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక రెడ్‌లైట్ ఏరియా సెటప్‌లో సాగుతుంది. దీనిని ఉర్దూలో 'హీరా మండి' లేదా 'డైమండ్ మార్కెట్' అని పిలుస్తారు. ఈ వెబ్‌సిరీస్ చాలా చర్చనీయాంశమైంది, హీరామండి గురించి ప్రజలలో ఆసక్తిని పెంచింది. అయితే ఇది ఒక నిజమైన ప్రాంతమని దీనికి సంబంధించిన వీడియోలతో సహా ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ తాజాగా వెల్లడించారు.

* కల్పితం కాదు, నిజం

ఇటీవల ఆ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో హీరా మండి ప్రాంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దాంతో హీరామండి అనే ఒక నైబర్‌హుడ్ & బజార్ లాహోర్‌లో ఇప్పటికీ ఉందని ప్రేక్షకులు తెలుసుకున్నారు. ఆమె షేర్ చేసిన వీడియోలో.. ఈ ప్రాంతం చాలా బిజీగా, రద్దీగా ఉన్నట్లు కనిపించింది. అలానే హీరా మండి ఇప్పుడు మనం చూసే సాధారణ మార్కెట్‌లా కనిపిస్తుంది, అక్కడ రోజువారీ వస్తువులు అమ్ముతున్నారు.

* వీడియో వైరల్

కంటెంట్ క్రియేటర్ షేర్ చేసిన హీరామండి వీడియో వైరల్‌గా మారింది. క్లిపింగ్‌ చూస్తే, ఆ ప్రాంతం చాలా సందడిగా కనిపిస్తుంది. స్థానిక వీధి వ్యాపారులు టీ, పకోడా, నట్స్ విక్రయిస్తున్నారు. పురాతన దుకాణాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశం ఇప్పుడు లాహోర్‌లోని పాపులర్ రెస్టారెంట్ హవేలీకి ప్రసిద్ధి చెందింది. ఈ వీడియోను @minahilaliwattoo అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్ షేర్ చేశారు. దీనికి "@హీరా మండి వెబ్‌సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో చూస్తున్న నా భారతీయ స్నేహితులందరికీ, లాహోర్‌లోని నిజ జీవితంలో ఇది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారి కోసం ఇది షేర్ చేశాను." అని క్యాప్షన్ యాడ్ చేశారు.

ఈ వీడియోను షేర్ చేసిన యూజర్, హీరా మండి ప్రాంతానికి సంబంధించి ఓ స్లో మోషన్ వీడియో క్లిప్‌ను కూడా పోస్ట్ చేశారు. దీంట్లో అండ్రూన్ లాహోర్ (అప్పటిలో హీరామండిలో ఒక భాగం) చరిత్ర అందాన్ని చూపించారు. ఆమె హీరా మండి ప్రస్తుత స్థితిని వివరిస్తూ ఒక పొడవైన క్యాప్షన్‌ను కూడా రాశారు. ఇప్పుడు ఇది ఒక పర్యాటక ప్రదేశం.

"ఆనాటి హీరామండి ఇప్పుడు ఉనికిలో లేదు. ఇది ప్రస్తుతం దుకాణాలు, రెస్టారెంట్లతో కూడిన ఒక పర్యాటక ప్రదేశంగా మారింది. ఈ రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్‌ను చాలా ఏళ్ల క్రితం కూల్చివేశారు. 1979లో ఆఫన్స్ ఆఫ్ జినా (ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ హుదూద్) ఆర్డినన్స్, VII ప్రకారం పాకిస్థాన్‌లో వ్యభిచారం చట్టవిరుద్ధం." అని ఆ మహిళా కంటెంట్ క్రియేటర్ క్యాప్షన్‌లో వివరించారు. హీరామండి వెబ్ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా తదితరులు నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో 2024, మే 1న విడుదలైంది.

2024-05-08T13:37:49Z dg43tfdfdgfd