HYD: ఫోటో కోసం ట్రై చేస్తే ప్రాణమే పోయింది.. ఎంత విషాదం..!

సోషల్ మీడియాలో లైకుల కోసం కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. సరదాకు చేసే కొన్ని పనులు చివరకు ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. లైకు, షేర్ల కోసం తాపత్రయపడి ప్రాణాలు కోల్పోయినవారు అనేకం. తాజాగా హైదరాబాద్ శివారు కీసరలోనూ అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఈత కొడుతూ ఫోటో దిగుదామనుకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురిలోని జెకె కాలనీకి చెందిన మోదుగ గౌతమ్‌ రాజ్‌ (22) అనే యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వీకెండ్ కావటంతో శనివారం తన స్నేహితులు అనురుధ్‌, అఖిల్‌తో కలిసి కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్‌ క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌తో ఫొటోలు దిగుతుండగా.. గౌతమ్‌రాజ్‌ ఒక్కసారిగా నీటిలో మునిగి పోయాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, సోషల్ మీడియా మోజు.. ఫోటోల పిచ్చితో ఇలాంటి పనులు చేయటం సరైంది కాదని పోలీసులు చెబుతున్నారు. ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండే ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవటం మంచిది కాదని అంటున్నారు. మీ పిచ్చితనం వల్ల కుటుంబసభ్యులకు తీరని వేధన మిగులుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T09:02:43Z dg43tfdfdgfd