HYD: రూ.1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. 25 నిమిషాల్లోనే పట్టేసిన పోలీసులు

ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే ఈజీగా డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.10 కోట్లు కొట్టేశారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు బ్యాంకు సిబ్బందిని, పోలీసులను అలెర్ట్ చేయటంతో 25 నిమిషాల్లోనే డబ్బును వెనక్కి రప్పించారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నాచారం ప్రాంతానికి చెందిన హర్ష్‌ అనే వ్యక్తి ఫోన్‌కు ఈ నెల 27న ఉదయం మూడు మెసేజ్‌లు వచ్చాయి. అతడి బ్యాంకు అకౌంట్ నుంచి ఉదయం 10.09 గంటలకు రూ.50 లక్షలు, 10.10 గంటలకు మరో రూ.50 లక్షలు, 10.11 గంటలకు రూ.10 లక్షలు మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయనేది ఆ మేసెజ్ సారాశం. ఉదయం 10.17 గంటల సమయంలో ఆ మెసేజ్‌లు చూసిన హర్ష్‌ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యుల సహకారంతో తొలుత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. అంతటితో ఆగకుండా 10.22 గంటలకు 1930 నంబరుకు ఫోన్‌ చేసి జరిగిన మోసాన్ని వారికి వివరించాడు.

నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (NCRP) నేతృత్వంలోని సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజమెంట్‌ సిస్టమ్‌ (CFCFRMS) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో టీఎస్‌సీఎస్‌బీ కూడా అలర్ట్ అయింది. వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ జరిగిన యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల అధికారులను అలర్ట్ చేశారు. ఆ సొమ్మును సైబర్‌ నేరస్థులు ఖాతాల నుంచి డ్రా చేయకుండా నిలిపేసినట్లు (పుట్‌ ఆన్‌ హోల్డ్‌) బాధితుడి ఫోన్‌కు 10.42 గంటల సమయంలో మెసేజ్ వచ్చింది. అప్పటికి నేరస్థులు రూ.10 వేలు మాత్రమే డ్రా చేయగలిగారు.

డబ్బు బెంగళూరులోని ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ అయినట్లు విచారణలో తేలింది. అవి సజావుద్దీన్‌, సలీముద్దీన్‌ ఖాతాలుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. బాధితుడి ప్రమేయం లేకుండా నగదు బదిలీ ఎలా జరిగిందని తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డబ్బులు పోగొట్టుకున్న వెంటనే తేరుకుని ఫిర్యాదు చేయగలిగితే వెనక్కి తెచ్చేందుకు అవకాశముంటుందనేందుకు ఈ ఉదంతమే నిదర్శనమని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయెల్‌ వెల్లడించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-30T06:13:12Z dg43tfdfdgfd