MOTILAL NAIK | లాల్‌ సలామ్‌ మోతీలాల్‌.. దవాఖానే జైలు ఉద్యమకారుడే ఖైదీ

  • పోలీసు పహారాలో గాంధీ దవాఖాన
  • మోతీలాల్‌ నాయక్‌పై పోలీసుల క్రౌర్యం
  • పరామర్శకు వెళ్లిన ప్రతిఒక్కరి అరెస్ట్‌
  • దవాఖాన దాపుల్లోకి రానివ్వని సర్కారు
  • నిరుద్యోగుల కోసం 8 రోజులుగా దీక్ష
  • ఆరోగ్యం దృష్ట్యా విరమించాలన్న డాక్టర్లు

Motilal Naik | హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 1 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట్‌: అది లక్షలాది మందికి ప్రోణం పోసిన దవాఖాన.. నిత్యం వందలాది మంది పేదలకు ఉచిత వైద్యసేవలందించే వర ప్రదాయిని.. కానీ, నేడు పోలీసుల బూట్ల చప్పుళ్ల నడుమ బందీఖానగా మారింది.. ఏ ఒక్కరినీ లోనికి వెళ్లనీయని జైలు గోడల్లా పోలీసుల వలయం ఆవరించింది.. పోలీసుల దమనకాండకు పరాకాష్ఠగా నిలిచింది.. రాష్ట్ర రాజధాని నగర పరిధిలోని గాంధీ దవాఖాన వద్ద నెలకొన్న అమానవీయ పరిస్థితికి అద్దంపడుతున్నది.

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మోతీలాల్‌నాయక్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న గాంధీ దవాఖాన నిర్బంధంలోకి వెళ్లిపోయింది. మోతీలాల్‌ను పరామర్శించేందుకు ఏ ఒక్కరినీ వెళ్లనీయకుండా పోలీస్‌ కంచె పహారా కాస్తున్నది. దవాఖాన పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసరాల్లో ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులను దరిదాపుల్లో లేకుండా తరలించేస్తున్నారు.

కనీసం మీడియాను సైతం మోతీలాల్‌ వైపు వెళ్లనీయకుండా అడ్డుగోడల్లా నిలిచారు. ప్రజాస్వామ్యయుతంగా ఓయూలో దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను తొలుత పోలీసులు గాంధీ దవాఖానకు తరలించారు. పట్టువీడకుండా ఆయన దీక్షను అక్కడే కొనసాగిస్తున్నారు.

మోతీలాల్‌కు సంఘీభావం తెలిపేందుకు విద్యార్థి, నిరుద్యోగ, రాజకీయ తదితర పక్షాల నేతలు దవాఖాన వద్దకు తరలివస్తున్నారు. వారంపాటు మోతీలాల్‌ దీక్షను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్‌ సర్కారు ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు వచ్చి పరామర్శించిన తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు కనిపిస్తుంది. ఆదివారం గాంధీ దవాఖానకు వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలపై నిరుద్యోగులు మండిపడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొన్నది.

అరెస్టును ఖండిస్తున్నా: హరీశ్‌రావు

గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్‌ నాయక్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రత్యేక బారికేడ్ల ఏర్పాటు

నిరుద్యోగుల ఆగ్రహాన్ని గుర్తించిన పోలీసులు సోమవారం నుంచి గాంధీ దవాఖానను తమ ఆధీనంలోకి తీసుకొని బలగాలను మోహరించారు. లోపలికి వచ్చే మార్గంలో బారికేడ్లు ఏర్పాటుచేసి డాక్టర్లు, సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. డీసీపీ గిరిధర్‌ పర్యవేక్షణలో చిలకలగూడ పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

భారీగా తరలివస్తున్న నిరుద్యోగులు

మోతీలాల్‌ దీక్షకు రోజురోజుకూ విశాల మద్దతు పెరుగుతున్నది. సోమవారం గాంధీ దవాఖాన ప్రాంగణంతోపాటు చుట్టుపక్కల పూర్తిగా నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున కనిపించారు. మోతీలాల్‌నాయక్‌ ఉన్న రెండో అంతస్తులోని ఐఎంసీ వార్డు వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆ యనను కలవడానికి ఎవరినీ అనుమతించలేదు. మోతీలాల్‌ స్పందనను తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించింది. ఓపిక కూడగట్టుకొని మోతీలాల్‌ మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు మీడియాను బయటకు పంపారు.

విరమించడం లేదు : డాక్టర్‌ రాజారావు

మోతీలాల్‌ నాయక్‌ తన దీక్షను విరమించబోనని పట్టుబడుతున్నారని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు వెల్లడించారు.

పోలీసుల తీరుపై నిరుద్యోగుల మండిపాటు

మోతీలాల్‌నాయక్‌ దీక్షపై కొందరు పోలీసుల దుష్ప్రచారంపై నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. రహస్యంగా మోతీలాల్‌ ఆహారం తీసుకుంటున్నాడంటూ నేరుగా మీడియా ప్రతినిధులకే పోలీసులు చేరవేస్తున్నారని తెలిసింది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని ఉన్నతాధికారులకు కూడా పంపినట్టు అబద్ధాలు చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం స్పందించకపోగా, ఇలా దుష్ప్రచారం చేసి తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2024-07-01T22:39:10Z dg43tfdfdgfd