ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

వెచ్చగా అమ్మ పొత్తిళ్లలో బజ్జోవాల్సిన నవజాత ఆడ శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణంతో ఉండగానే మట్టిలో పూడ్చేశారు. అటుగా వెళ్తోన్న ఓ ట్యాంకర్ డ్రైవర్ మట్టిలో ఏదో కదులుతున్న ఆనవాళ్లు గుర్తించి తవ్విచూశాడు. పసిగడ్డు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. స్థానిక ఉపాధి కూలీల సాయంతో ఆసుపత్రికి తరలించి పసికందుకు పునర్జన్మను ప్రసాదించాడు. గుండెలు పిండేసే ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయరహదారి పక్కన శనివారం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ - భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్‌ డ్రైవర్‌ రాందినయ్‌ జాతీయరహదారి పక్కనే ఉన్న నీటి తొట్టి నుంచి శనివారం నీటిని రోడ్డు విస్తరణ పనులకు తీసుకువెళ్తున్నాడు. నీటితో ట్యాంకర్‌ను నింపుతున్న క్రమంలో రహదారి పక్కనే మట్టిలో ఓ శిశువు కాళ్లు, చేతులు కదులుతూ కనిపించింది. మట్టిని తొలగించి చూడగా ఓ ఆడశిశువు కనిపిచింది. కొన ఊపిరితో పాప కొట్టుమిట్టాడుతోంది. లారీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై.. అక్కడే పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను పిలిచి శిశువును కాపాడారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు రాగా.. వారి వాహనంలోనే దామెర క్రాస్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఆడ శిశువు కావడంతో తల్లిదండ్రులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T04:31:56Z dg43tfdfdgfd