శెభాష్ సాయిచరణ్.. సాహస బాలునికి సీఎం రేవంత్ సన్మానం

Shadnagar Fire Accident: రంగారెడ్డి జిల్లా నందిగామలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో.. సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలున్ని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. అగ్ని ప్రమాదం సమయంలో విద్యార్థి సాయిచరణ్‌ ప్రదర్శించిన తెగింపు, దైర్య సాహసాల గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పిల్లాడి కుటుంబాన్ని తన నివాసానికి పిలిపించుకుని మరీ అభినందించారు. బాలుడి సాహసాన్ని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. శాలువాతో సన్మానించారు. మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. సాయిచరణ్ చూపించిన తెగువ ఎంతో మంది యవతకు స్ఫూర్తి అని రేవంత్ అభిప్రాయపడ్డారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ నెల 26న నందిగామలో స్థానిక ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. తన స్నేహితుడి తల్లి అదే కంపెనీలో పనిచేస్తుండడంతో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే సాయిచరణ్ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే చాలా మంది కార్మికులు బయటికి వచ్చేయగా.. మరో 50 మంది వరకు చిక్కుకుపోయారు. కాపాడండి అంటూ అరుస్తున్న వారి ఆర్తనాదాలు విన్న సాయి చరణ్.. అగ్నిమాపక సిబ్బందికి సాయం చేశాడు.

నాలుగో అంతస్తుకు వెళ్లి.. తాడు సాయంతో అక్కడున్న వాళ్లు కిందికి వచ్చేలా సాయం అందించాడు. అందరూ కిందికి చేరుకున్న తర్వాత మళ్లీ కిందికి వచ్చాడు. సుమారు ఆరుగురి ప్రాణాలు కాపాడినట్టుగా పోలీసులు చెప్పారు. ఆ సమయంలో సాయి చరణ్ చూపించిన ధైర్య సాహసాలను ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే శంకర్ రూ. 5 వేలు రివార్డుగా ఇవ్వగా.. తీసుకోవడానికి బాలుడు నిరాకరించాడు కూడా. దీంతో అక్కడ ఉన్నవారంత సాయిచరణ్‌ను మరింతగా మెచ్చుకున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-28T12:36:18Z dg43tfdfdgfd