జగన్‌ను ఎగతాళి చేసేలా టాలీవుడ్ ప్రముఖులు తలకు బ్యాండేజీలు వేసుకున్నారా..?

ఎన్నికల ఫీవర్‌తో ఏపీ ఊగిపోతోంది. రాజకీయ పార్టీల ప్రచారాలు, సభలు, రోడ్ షోలతో రాష్ట్రం మొత్తం ఎన్నికల మూడ్‌లో ఉంది. ఇక నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండటంతో అభ్యర్థులు అందరూ.. నామపత్రాలు దాఖలు చేసే పనిలో పడ్డారు. అయితే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నిర్మాతలు బన్నీ వాసు, శ్రీనివాస కుమార్ (SKN), డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సాయిరాజేష్, కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ అందులో ఉన్నారు.

వైరల్ ఫోటో ఏంటీ?

టాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ ప్రొడ్యూసర్లుగా గుర్తింపు పొందిన బన్నీవాసు, ఎస్‌కేఎన్, సాయిరాజేష్‌లతో పాటు కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో జానీమాస్టర్ కన్నుకు, ఎస్‌కేఎన్ నుదిటికి, బన్నీవాసు ఎడమకన్ను పై భాగంలో, సాయిరాజేష్ ఎడమ కన్నుకు ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. అయితే సీఎం వైఎస్ జగన్‌కు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఇటీవల జరిగిన రాయిదాడి ఘటనలో గాయాలయ్యాయి.

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సమీపంలో జగన్ మీద రాయితో దాడి చేయగా.. ఈ ఘటనలో జగన్‌ ఎడమకన్ను పైభాగంలో, వెల్లంపల్లికి కన్నుకు గాయాలయ్యాయి. చికిత్స తర్వాత వారు బ్యాండేజీలతోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాయి దాడి తర్వాత సీఎం జగన్, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌లాగా దెబ్బ తగిలిన చోటా బ్యాండేజ్ వేసుకుని ఫొటోలు దిగారంటూ ఈ ఫోటోను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

అసలు నిజమేంటి?

అసలు విషయం ఏమిటంటే ఈ ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమయం తెలుగు ఫ్యాక్ట్ చెకింగ్‌లో తేలింది. పిఠాపురంలో జరిగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జానీమాస్టర్, ఎస్‌కేఎన్, బన్నీవాసు, సాయిరాజేష్ అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఓ గ్రూప్ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే కొంతమంది ఈ ఫోటోను ఎడిట్ చేసి.. ప్లాస్టర్లు వేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఎలా తెలిసింది?

వైరల్ అవుతున్న ఫోటోను సమయం తెలుగు ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇందులో భాగంగా వైరల్ అవుతున్న ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ఉపయోగించి సెర్చ్ చేయగా.. అసలు ఫోటో బయటపడింది. ఏప్రిల్ 23వ తేదీన జానీమాస్టర్, బన్నీవాసు, సాయి రాజేష్‌లతో కలిసి పిఠాపురంలో దిగిన ఫోటోను నిర్మాత ఎస్‌కేఎన్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. పిఠాపురం టుడే అంటూ ఈ ఫోటోను షేర్ చేశారు. అయితే ఇలా షేర్ చేసిన ఫోటోను కొంతమంది డిజిటల్ ఎడిట్ చేసి.. ప్లాస్టర్లు అతికించి, నెట్టింట వైరల్ చేశారు. నిజమైన ఫోటోను ఎస్‌కేఎన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఫోటో ఎడిట్ చేసిందని.. అందులో తెలిపారు.

తీర్పు

నిర్మాత బన్నీవాసు, ఎస్‌కేఎన్, సాయిరాజేష్, జానీ మాస్టర్ తమ గాయాలకు ప్లాస్టర్లు వేసుకుని ఉన్నట్లుగా వైరల్ అవుతున్న ఫోటో నిజం కాదని మా ఫ్యాక్ట్ చెకింగ్‌లో తేలింది. ఫోటోను ఎడిటింగ్ చేసి సీఎం వైఎస్ జగన్, వెల్లంపల్లి గాయాలను అనుకరిస్తూ ఉన్నట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని నిర్ధారించడమైంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T15:15:34Z dg43tfdfdgfd