HYDERABAD | పుస్తకాలు అందలె యూనిఫాంలు చేరలె.. హైదరాబాద్‌ విద్యాశాఖలో ఎందకింత నిర్లక్ష్యం..?

  • అలసత్వం ప్రదర్శిస్తున్న జిల్లా విద్యాధికారులు
  • నోటీసులు జారీ చేసినా మారని తీరు
  • పదో తరగతి ఫలితాల్లోనూ వెనకబడిన జిల్లా

Hyderabad | సిటీబ్యూరో, జూన్‌ 30 ( నమస్తే తెలంగాణ ) : బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్‌ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం కొన్ని స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు, పుస్తకాలు అందకపోవడం గమనార్హం. ఈ విషయం ఆకస్మిక పర్యటన చేసిన కలెక్టర్‌ దృష్టిలో వెలుగు చూసింది. ఏ ఒక్క విద్యార్థి బడికి దూరం కాకూడదని ప్రభుత్వాలు సకల సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుంటాయి. కానీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదే. అయితే హైదరాబాద్‌లో విద్యాధికారులు మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది. మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలవాల్సిన హైదరాబాద్‌ విద్యారంగంలో ఏటా వెనకబడి అధ్వాన స్థితికి జారిపోతున్నది. విద్య, వసతులను మెరుగుపరుస్తూ..నాణ్యమైన బోధన అందుతుందా? లేదా? అనే విషయంపై దృష్టి సారించాల్సిన జిల్లా విద్యాధికారి ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినా.. తీరు మారలె..

జిల్లాలో విద్యాశాఖ సరిగా పనిచేయడం లేదని కలెక్టర్‌ ఏకంగా డీఈఓ రోహిణీకి నోటీసులు జారీ చేయడం ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. అయినా విద్యాశాఖలో మార్పు రాలేదు. ఉన్నతాధికారులను హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదు. డీఈఓ పర్యవేక్షణ కరువై పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాలు, యూనిఫాంలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇటీవల గోల్కొండలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ అక్కడ విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు అందలేదనే విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో డిప్యూటీ డీఈఓ రమణా రాజు, డిప్యూటీ ఐఓఎస్‌ మాక్బుల్‌ అహ్మద్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వాజీద్‌ హస్మికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

పది ఫలితం.. ఆగం..

జిల్లాలో మొత్తం 3వేలకు పైగా పాఠశాలలు ఉంటాయి. ప్రతి పాఠశాలలో వసతులు, బోధన, ప్రత్యేక కార్యక్రమాలపై నిరంతరం పర్యవేక్షణ జిల్లా విద్యాధికారిదే. అనంతరం 24 మంది డీఐఓస్‌లు ఉంటారు. వారంతా పాఠశాలలపై దృష్టి సారించాలి. కానీ క్షేత్రస్థాయిలో వారంతా నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో 30వ స్థానానికి దిగజారింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పాఠశాలలు సకల వసతులతో నాణ్యమైన బోధన ఉండాలి. కానీ అవేం ఇక్కడ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2024-06-30T18:59:30Z dg43tfdfdgfd