TOIFA: టైమ్స్ ఆఫ్ ఇండియా సినిమా అవార్డులు.. ఈసారి OTT విభాగంలోనూ, ముంబైలో ఘనంగా ఆవిష్కరణ

దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రతిష్టాత్మక TOIFA (టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్) పున:ప్రారంభాన్ని ఘనంగా ప్రకటించింది. బీసీసీఎల్ ద్వారా OTT ఎడిషన్‌లో అవార్డుల ప్రకటనకు సంబంధించిన కార్యక్రమాన్ని ముంబైలో శుక్రవారం (జూన్ 28) ప్రారంభించింది. ఈసారి మొట్టమొదటిసారిగా ఓటీటీ విభాగంలోనూ అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది. భారతీయ ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ అవుతున్న హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు గాను అవార్డులను అందించనుంది. నటన, కథాకథనం, సాంకేతిక నిపుణులు, సంగీతం తదితర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి TOIFA అవార్డులను అందించనున్నారు. కిందటేడాదికి (2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు) గాను ఈ అవార్డులను ప్రకటించనున్నారు.

ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘బెన్నెట్, కోల్‌మన్ & కంపెనీ లిమిటెడ్ (BCCL)’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పబ్లిషింగ్) & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివకుమార్ సుందరం ఈ అవార్డులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ (రాయ్ కపూర్ ఫిల్మ్స్), ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాశిష్ సర్కార్ సహా పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ వినోదం రంగంలో డైనమిక్ పరిణామాన్ని గురించి ప్రస్తావిస్తూ.. వక్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ (TOIFA) భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరో మంచి అవార్డుల వేదికగా ఆవిర్భవించింది. ఈ సంవత్సరం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ TOIFA - హిందీ OTT ఎడిషన్‌ను ప్రారంభించాం. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో పకడ్బందీ ఓటింగ్ ప్రక్రియ ద్వారా మేము OTTలో 28 విభాగాల్లో అవార్డులను అందజేస్తాం’ సీఈవో శివకుమార్ సుందరం చెప్పారు.

ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులతో కూడిన జ్యూరీ/అకాడెమీ వివిధ అవార్డు కేటగిరీలపై ఓటింగ్ నిర్వహిస్తుందని అధ్యక్షుడు శిబాశిష్ సర్కార్ తెలిపారు. TOIFA OTT అవార్డ్స్‌తో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు ఈ ప్లాట్‌ఫాంలో ప్రమాణాలను పెంచేందుకు తోడ్పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజ్‌కుమార్ హిరానీ, సూజిత్ సిర్కార్, సమీర్ నాయర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, నిఖిల్ అద్వానీ, ఆనంద్ ఎల్. రాయ్, గునీత్ మోంగా కపూర్, రవీనా టాండన్, మధురీతా ముఖర్జీ తదితర సనీ రంగ ప్రముఖులతో కూడిన సలహా మండలి TOIFA అవార్డులకు మార్గదర్శకత్వం చేస్తోంది.

మీ ఓటు వేయండిలా..

వినోదానికి సంబంధించిన కంటెంట్ అనేది అంతిమంగా ప్రేక్షకులకు సంబంధించినది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని టైమ్స్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ప్రేక్షకుల అభిప్రాయానికి ప్రాధాన్యం కల్పిస్తుంది. ఈ క్రమంలో TOIFA OTT ఎడిషన్‌కు సంబంధించి ‘పీపుల్స్ ఛాయిస్ ఓటింగ్ అవార్డ్స్‌’ను నాలుగు ప్రధాన విభాగాలలో ప్రవేశపెట్టింది.

విభాగాలు:

మేల్ యాక్టర్ – వెబ్ ఫిల్మ్

ఫిమేల్ యాక్టర్ – వెబ్ ఫిల్మ్

మేల్ యాక్టర్ – వెబ్ సిరీస్

ఫిమేల్ యాక్టర్ – వెబ్ సిరీస్

www.toifa.in ద్వారా లాగిన్ అయ్యి, ప్రేక్షకులు తమకు ఇష్టమైన వారికి ఓటు వేయవచ్చు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-28T14:38:47Z dg43tfdfdgfd