WEDNESDAY MOTIVATION: ప్రాచీ... ఈ ప్రపంచాన్ని గెలిచేందుకు సిద్ధంగా ఉండు, అందం కన్నా ప్రతిభే గొప్పదని నిరూపించు

Wednesday Motivation: ఆడవాళ్ళని అందంతో అంచనా వేయడం ఎప్పుడు ఆగిపోతుందో... స్త్రీకి అందమే కొలమానం కాదు. వారిలోనూ ఎన్నో తెలివితేటలు, ప్రతిభా ఉంటాయి. ఆ ప్రతిభను, ఆ తెలివితేటలను గుర్తిస్తే... అందం వాటి ముందు ఎందుకు పనికిరాని అంశమే అవుతుంది. అందానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. కానీ ప్రతిభకు, తెలివితేటలకు ముగింపు అనేది ఉండదు. 40 ఏళ్లు దాటితే ప్రతి మనిషి ముఖం మీద ముడతలు రావాల్సిందే. రాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కానీ ప్రతిభ... వయసు పెరిగే కొద్దీ అనుభవాలతో జతపడి మరింతగా దృఢపడుతుంది. అందం గొప్పదా? టాలెంట్ గొప్పదా? అని అడిగితే... బుర్ర ఉన్న వారెవరైనా టాలెంటే గొప్పదని ఒప్పుకుంటారు.

ప్రతిభ, తెలివితేటలు కలవారే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులను ఆవిష్కరించారు. వాటిని ఆవిష్కరించిన ఏ శాస్త్రవేత్త కూడా అందగాడు కాదు. ఏళ్ల తరబడి ఒకే గదిలో ఆవిష్కరణల కోసం అంకితం అయిపోయి... జుట్టు, గడ్డాలు, మీసాలు పెంచుకొని తమ ముఖాన్ని తామే చూసుకోలేనంతగా మారిపోయారు. ఆవిష్కరణ విజయవంతం అయ్యాకే తమ వ్యక్తిగత అవసరాలపై దృష్టి పెట్టేవారు. వారు అందానికే విలువ ఇచ్చి ఉంటే... ఇప్పుడు మనం వినియోగించే ఎన్నో అధునాతన సౌకర్యాలు దక్కి ఉండేవి కాదు.

ప్రాచీ నిగమ్ చేసిన తప్పేంటి?

మీ ముందు తెలివైన, ప్రతిభ ఉన్న విద్యార్థులు కనిపిస్తే వారిని అందంతో కొలవకండి. వారిలోని ప్రతిభ ఎంతో కొలవండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రాచీ నిగమ్ విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతోంది. ఆమె ఉత్తర ప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు తెచ్చుకుంది. 600 మార్కులకుగాను 591 మార్కులు సాధించింది. ఆమె ఫోటోలు అన్ని పేపర్లలోనూ పడ్డాయి. ఆమెకు వచ్చిన మార్కులను ఎవరూ చూడలేదు, ఆమె రూపాన్ని మాత్రమే చూసి సోషల్ మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

ఆమె చూడడానికి అబ్బాయిలా ఉందని, గడ్డాలు, మీసాలు ఉన్నాయంటూ కామెంట్లు చేశారు. అలా కామెంట్లు పెట్టిన ఎవరైనా ఆమెలా తాము చదవగలమా? ఇంత గుర్తింపు సాధించగలమా? అని ఆలోచించలేదు. ఆమె ముఖం, రూపం రంగును మాత్రమే వారు గుర్తించారు. కానీ ఆమె ప్రతిభను గుర్తించలేకపోయారు. సంకుచిత మనస్తత్వం కలవారంతా ఇలానే ఉంటారు.

తాము ట్రోల్ చేస్తున్నది ఎవరిని, వారిని ట్రోల్ చేసే అర్హత తమకు ఉందా? లేదా? అని కూడా ఆలోచించరు. స్టేట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయిని ట్రోల్ చేయాలంటే... అంతకుమించి అర్హత మీకు ఉండాలి. ఎదుటి వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా కామెంట్లు చేయకూడదు. ఆ అమ్మాయికి ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఇంట్లోనూ అలాంటి ఆడపిల్లలు ఉంటారు. మీ ఇంట్లోనే ఉన్న ఆడపిల్లకి అలాంటి సమస్య వస్తే ఇలానే ట్రోల్ చేస్తారా?

హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇలా ఆడపిల్లల్లో మీసాలు, గెడ్డాలు వస్తాయి. ఈ సమస్య ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు ట్రోల్ చేసిన ఎంతోమందికి భవిష్యత్తులో ఈ సమస్య రాదని చెప్పగలరా? అలాగే PCOS అనే సమస్య కూడా ఉండవచ్చు. ఆమె ఆరోగ్య స్థితిని తెలుసుకోకుండా చేయడం మీ పనికిరాని వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ సాధించిన ప్రాచీ త్వరలోనే ప్రపంచాన్ని గెలిచే యువతిగా ఎదగాలి. ఆమె అనుకున్న విధంగా ఇంజనీరింగ్ పట్టా పొందాలి. అందులోనూ మన దేశ గౌరవాన్ని పెంచే ఆవిష్కరణలను చేయాలి. అందం ఆమె ప్రయాణాన్ని ఆపలేదు. ఆమె విజయాన్ని అడ్డుకోలేదు. ట్రోల్ చేసిన వారంతా ఫోన్లలో, సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటారు... ఆమె మాత్రం ఒక్కో మెట్టు ఎక్కుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది.

మీరు ఎవరినైనా బాడీ షేమింగ్ చేసే ముందు మీరు వారి స్థితిలో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎవరిని విమర్శిస్తున్నాం? ఎందుకు విమర్శిస్తున్నాం? అన్న కనీస ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. వీలైతే వారికి అండగా ఉండండి. లేకుంటే నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోండి. ఎదుటివారి అందచందాలని ఎంచాల్సిన అవసరం లేదు. మీరు ఒక వేలుని ఎదుటివారి వైపుకు చూపిస్తున్నప్పుడు.. మిగతా నాలుగు వేళ్ళు మీ వైపే చూపిస్తూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకొని ఎవరి పైన అయినా మాటలు విసరండి.

2024-04-23T23:55:23Z dg43tfdfdgfd