ఇల్లీగల్ దందాలను ఉపేక్షించం : ఎస్పీ శ్రీనివాస రావు

ఇల్లీగల్ దందాలను ఉపేక్షించం : ఎస్పీ శ్రీనివాస రావు

  •    ‘వెలుగు’ ఇంటర్వ్యూలో ఆసిఫాబాద్ కొత్త ఎస్పీ శ్రీనివాస రావు
  •     డ్రగ్స్, సైబర్ నేరాల నిర్మూలనపై ఫోకస్
  •     పోడు సమస్యపై ప్రత్యేక దృష్టి 
  •     వరదలకు ఒక్క ప్రాణం కూడా పోకుండా చర్యలు తీసుకుంటాం

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో  డ్రగ్స్​ను రూపుమాపి, సైబర్ క్రైమ్​ను కంట్రోల్ చేయడమే ఇప్పుడు పొలీస్ శాఖ ముందున్న పెద్ద సవాల్ అని, దీన్ని ఛాలెంజ్​గా తీసుకుంటామని.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతామని ఆసిఫాబాద్​ కొత్త ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు. ఇటీవల భాద్యతలు చేపట్టిన ఆయన జిల్లాలో చేపట్టే పోలీసింగ్​తో పాటు వివిధ అంశాలపై ‘వెలుగు’తో మాట్లాడారు. ప్రజలకు పోలీసులు, కళాజాత బృందాలతో అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. గంజాయి, గుట్కా, నాటుసారా, నకిలీ విత్తనాలు, ఇసుక, భూ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు. ఆయన మాటల్లోనే..

మత్తు ద్వారా జరిగే అనర్ధాలను వివరిస్తం

మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా జరిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తాం. ప్రజల కోసం మేమున్నామని భరోసా కల్పించేలా 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అపద వచ్చినా, సమస్య ఉన్నా వెంటనే 100 కి ఫోన్ చేయాలి.  వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తగు చర్యలు తీసుకుంటారు. 

దీనిపై ప్రతీరోజూ మానిటరింగ్ చేస్తున్నాం. మహిళా రక్షణ కోసం షీ టీంలు24 గంటలు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో ఇప్పుడు ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 8 వరకు వెహికిల్ తనిఖీలు చేపడతాం. ట్రాఫిక్ రూల్స్ పట్ల విస్తృత అవగాహన కల్పిస్తాం. కాగజ్ నగర్ లో గుట్కా, మట్కా జోరుగా సాగుతోందని మా దృష్టికి వచ్చింది. దీన్ని పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. మహారాష్ట్ర నుంచి గుట్కా, మద్యం జిల్లాకు రాకుండా చెక్ పోస్టులు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.

అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతం

ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని.. అక్రమార్కులు, దాందాలు చేసేవాళ్లు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వాళ్ల పట్ల మా వైఖరి కఠినంగానే ఉంటుంది. ఏజెన్సీలో ట్రైబల్, నాన్ ట్రైబల్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం. గ్రామ పటేళ్లతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలు తెలుసుకుంటున్నాం.  జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదు. 

అయినా అలర్ట్ గా ఉంటాం. వానాకాలంలో వరదలపై అప్రమత్తంగా ఉన్నాం. ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రాణనష్టం జరగకుండా చూస్తాం. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, గేమ్స్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఆసిఫాబాద్​ను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తం.

  ©️ VIL Media Pvt Ltd.

2024-06-29T04:43:12Z dg43tfdfdgfd