దొంగలల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు : కేసీఆర్

దొంగలల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు : కేసీఆర్

హైదరాబాద్ / సిద్దిపేట / ములుగు, వెలుగు: బీఆర్ఎస్​ను వీడి దొంగలల్ల కలిసేటోళ్ల గురించి బాధ లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని అన్నారు. ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేమీ కాదని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని, మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందని అన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్​హౌస్​లో శుక్రవారం కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘సమైక్యవాదులతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు.. ఇప్పుడున్న పరిస్థితులు ఒక లెక్కనే కాదు. పార్టీ వీడి దొంగలల్ల కలిసేటోళ్ల గురించి మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ’’  అని కేసీఆర్​ అన్నారు.

‘‘తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉన్నది. తెలంగాణ ఆత్మను అర్థం చేస్కుంటూ.. సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా బీఆర్ఎస్​కు మాత్రమే ఉన్నది’’అని కేసీఆర్​ అన్నారు.  

రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి

పార్టీ నేతలు, కార్యకర్తలంతా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం ఇంకా బాగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. ‘‘ప్రజలు అవకాశం ఇస్తే పదేండ్ల పాటు ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా.. లక్ష్యం ప్రకారం పని చేసినం. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి ఎన్నో మౌలిక వ్యవస్థలను మెరుగుపర్చినం. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపినం. కుల వృత్తులను అభివృద్ధి చేసి గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినం’’అని కేసీఆర్ అన్నారు. ‘‘కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటరు. మొన్న జరిగిన ఎన్నికల్లో అదే జరిగింది. అంత మాత్రాన పార్టీ నేతలు, కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు. అధికారం ఉంటేనే పని చేస్తామనడం పద్ధతి కాదు. 

మనం ఏ హోదాలో ఉన్నా.. ప్రజల కోసం పని చేయాల్సిందే. మన అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే. ప్రజల కలలను మనం మాత్రమే నెరువేరుస్తం. ఆ నాడు మనం ఉద్యమంలోకి దిగినప్పుడు మనతో ఎవరున్నరు? అప్పుడైనా.. ఇప్పుడైనా.. నాయకులను తయారు చేసుకునేది పార్టీనే.. మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగలల్ల కలిసిండు. బాధపడేదేమీ లేదు. ఆయన్ను తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీనే.. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేస్కుంటది’’అని కేసీఆర్ అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మీటింగులకు కేసీఆర్ కొద్దిగా బ్రేక్ ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకుంటారని చెప్పాయి. సమావేశాలు ఉంటే మళ్లీ ప్రకటిస్తామని వెల్లడించాయి. ముందస్తు సమాచారం లేకుండా తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని నేతలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-06-29T01:57:41Z dg43tfdfdgfd