విజయశాంతి ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పిన ఎన్టీఆర్.. చిరంజీవితో డబ్బింగ్ చెబుతుండగా, నటి కామెంట్స్

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. శతజయంతి సందర్భంగా అభిమానులు, తారలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

 

లేడి సూపర్ స్టార్, బిజెపి నేత ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని, ఆయన తన చిన్ననాటి నుంచి ప్రోత్సహించిన విధానాన్ని తలచుకుని అభిమానులతో పంచుకున్నారు. 

 

ఈ మేరకు విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు..డాక్టర్ ఎన్టీఆర్ గారు... నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది. 1980లో ఆ చిత్రంలో వారిద్దరితో కలసి నటించాను. 

 

1985లో నేను నటించిన ప్రతిఘటన చిత్రానికి గాను.. ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రి హోదాలో నాకు నంది అవార్డు అందించారు. ఆ తరహా చిత్రాలు మరిన్ని చేయాలని ప్రోత్సహించి అభినందించి ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ..బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు 1990లో నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో సినిమా చేస్తున్నాం. 

 

ఆయన్ని కలవడానికి డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళాను. కానీ డబ్బింగ్ థియేటర్ లో వెలుతురు సరిగ్గా లేదు. దీనితో ఎన్టీఆర్ గారు నన్ను గమనించకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత నేను వచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆ మరుసటి రోజే స్వయంగా ఎన్టీఆర్ గారు ఉదయం 6 గంటలకే మద్రాసులోని మా ఇంటికి వచ్చారు. అదే సమయానికి నేను షూటింగ్ కోసం ఫ్లయిట్ లో హైదరాబాద్ వెళ్లాను. 

 

అమ్మాయిని మేము చూసుకోలేదు, పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతుంది. అంతేగాక, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ "జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, I am extremely sorry ..." అని చెప్పినంతవరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే.

 

ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేది.అదే గాకుండా, నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు . ఆదరాభిమానాలకు మరో రూపు...   ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు.

 

100 సంవత్సరాలైనా.. మరో వంద సంవత్సరాలైనా.. సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే.. సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే.. అంటూ విజయశాంతి ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని అందంగా గుర్తు చేసుకున్నారు. 

2023-05-28T02:16:49Z dg43tfdfdgfd