PAWAN KALYAN | కొండగట్టుకు బయల్దేరిన పవన్‌ కల్యాణ్‌.. దారిపొడవునా అభిమానుల ఘనస్వాగతం

Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు అంజన్న దర్శనానికి బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు. ముందుగా హైదరాబాద్‌ శివారులోని తుర్కపల్లిలో పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్‌ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరారు.

ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్‌ కల్యాణ్‌ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని శనివారం దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం సాయంత్రం ఆయన రోడ్డుమార్గంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చేరుకుంటారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. కాగా, గత ఏడాది ఎన్నికలకు ముందు ప్రచారం మొదలుపెట్టిన పవన్‌ కల్యాణ్‌.. తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారాహి విజయయాత్రను నిర్వహించారు.

2024-06-29T05:58:17Z dg43tfdfdgfd