JULY CALENDAR 2024 జూలై నెలలో జగన్నాథ రథయాత్ర, బోనాల జాతర, యోగిని ఏకాదశితో పాటు ఏయే ముఖ్య పండుగలొచ్చాయంటే...

July Calendar 2024 తెలుగు పంచాంగం ప్రకారం, జూలై మాసంలో యోగిని ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, బోనాల జాతర, గురు పూర్ణిమతో పాటు మరిన్ని ముఖ్యమైన పండుగలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏయే తేదీల్లో ఏయే పండుగలొచ్చాయి.. వాటి ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

July Calendar 2024 హిందూ పంచాంగం ప్రకారం, జూలై మాసంలో ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఇదే నెలలో యోగిని ఏకాదశి రానుంది. ఈ ఏకాదశి శ్రీ విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది. అంతేకాదు జగన్నాథ రథయాత్ర, బోనాల పండుగ సంబరాలు, గుప్త నవరాత్రులు, గురు పూర్ణిమ కూడా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ అమావాస్య, కోకిల వ్రతం వంటి అనేక ముఖ్యమైన పండుగలు జూలై మాసంలోనే జరుపుకోనున్నారు. జ్యోతిష్యం ప్రకారం, ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయనున్నాయి. ఈ సందర్భంగా జూలై నెలలో వచ్చే ప్రధాన పండుగల తేదీలు, మతపరంగా వాటి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...యోగిని ఏకాదశి..

ఈ నెల రెండో తేదీన మంగళవారం రోజున యోగిని ఏకాదశి రానుంది. ఈ పవిత్రమైన విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఈసారి యోగిని ఏకాదశి వేళ త్రిపుష్కర యోగం, సర్వార్ధ సిద్ధి యోగం వంటి మహాయోగాలు ఏర్పడనున్నాయి.

ఆషాఢ అమావాస్య..

ఈ నెల 5 జూలై 2024 శుక్రవారం నాడు ఆషాఢ అమావాస్య జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే పవిత్రమైన నదులలో స్నానం చేసి, తమ పూర్వీకులకు తర్పణం, పిండదానం, శ్రాద్ధ కర్మలు తదితర వాటిని ఆచరిస్తారు. పవిత్ర నదులకు వెళ్లలేని వారు ఇంట్లోనే గంగాజలం కలిపి స్నానం చేయొచ్చు.

బోనాల జాతర, గుప్త నవరాత్రులు..

ఈ నెల 6 జూలై 2024 శనివారం నుంచి ఉత్తర భారతంలో గుప్త నవరాత్రులు, వారాహీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. మరోవైపు ఆషాఢ మాసం కూడా ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఆషాఢంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం నాడు బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. ముందుగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించి.. తర్వాత లాల్ దర్వా మహంకాళి ఉజ్జయిని మహంకాళి ఆలయాలతో పాటు అనేక ఆలయాల్లో నెల రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుంటారు. చివరగా తిరిగి గోల్కొండ కోటలోనే పూజ చేసి, వ్యాధుల నుంచి మమ్మల్ని రక్షించమని అమ్మవారిని వేడుకొంటారు.

జగన్నాథ రథయాత్ర..

ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం విధియ తిథి నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 7 జూలై 2024 ఆదివారం రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి తన మేనత్త ఇంటికి వెళ్తాడు. హిందూ మతంలో ఈ రథయాత్రకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రథయాత్రకు దేశవిదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో యాత్రికులు వస్తారు.

హరి శయని ఏకాదశి, చాతుర్మాసం ప్రారంభం..

ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో హరిశయని ఏకాదశి తిథి వేళ శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది 17 జూలై 2024న హరిశయని ఏకాదశి వచ్చింది. ఇదే సమయంలో చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభం కానుంది. ఈ సమయంలో శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. మరోవైపు మొహర్రం పండుగ కూడా జరుపుకోనున్నారు.

కోకిల వ్రతం..

ఈ నెల 20 జూలై 2024 శనివారం రోజున కోకిల వ్రతం జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో శుక్ల పక్షం చతుర్దశి రోజున కోకిల వ్రత దీక్షను ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున పార్వతీదేవిని కోకిల రూపంలో పూజిస్తారు. ఈ ఉపవాసం ఆషాఢ మాసంలోని చతుర్దశి తిథి నుంచి ప్రారంభమై శ్రావణ మాసం పౌర్ణమి రోజు వరకు కొనసాగుతుంది.

గురు పూర్ణిమ..

ఈ నెల 21 జూలై 2024 ఆదివారం నాడు గురు పూర్ణిమ పండుగను జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమను గురు పూర్ణిమ, వేద వ్యాస్ జయంతి అని కూడా అంటారు. ఇదే రోజున బుుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంతో పాటు 18 పురాణాలు, మహాభారత గ్రంథం, భాగవతం వంటి అనేక గ్రంథాలు రచించారు.

Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T07:44:24Z dg43tfdfdgfd