PAWAN KALYAN: ప్రధాని సభలకు ఎస్పీజీ వాళ్లు నన్ను రావొద్దన్నారు

Deputy cm Pawan Kalyan speech at pithapuram: డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జనసేన వీరమహిళలు, కార్యకర్తలతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పవన్. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగి విజయం సాధించాయి. ఇక ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఏపీలో పర్యటించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలసి సభలు, రోడ్ షోలు నిర్వహించారు. అయితే అప్పట్లో జరిగిన ఓ సంగతిని పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో నాటి సంగతులను కార్యకర్తలతో పంచుకున్నారు.

ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు.. చాలాసార్లు తనను సభలకు రావద్దని అన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీ జనసేన వాళ్ల శక్తిని భరించలేకున్నామని.. అందుకే మీరు సభలకు రాకుండా ఉండాలని కోరుకుంటామని ఎస్పీజీ అధికారులు తనతో (Pawan kalyan) చెప్పినట్లు పవన్ చెప్పారు. ఏపీలోని యువత ఎన్నో ఏళ్లుగా నలిగిపోయి ఉన్నారన్న పవన్ కళ్యాణ్.. తమ తరుపున ఎవరు మాట్లాడతారా అని ఎదురూచూశారని చెప్పారు. అందుకే యువత తరుపున వారి గొంతుకగా మారినట్లు చెప్పారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు తుపాను అని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం చెప్పలేదన్న పవన్ కళ్యాణ్.. ఫలితాల కంటే ముందే మోదీ ఈ విషయం చెప్పారన్నారు. ఏపీ ఎన్నికలు పూర్తైన తర్వాత తాము వారణాసిలో జరిగిన మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లామని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తుపాను అంటూ ప్రధాని చెప్పినట్లు పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు తనకు ఆ విషయం అర్థం కాలేదన్న ఏపీ డిప్యూటీ సీఎం.. తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మోదీ మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం అర్థమైందన్నారు.

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తాము వారణాసిలో మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యామన్న పవన్ కళ్యాణ్.. అప్పటికే ఎన్నికల సరళిపై ప్రధానికి నివేదికలు అందాయని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో జనసేన హవా ఉంటుందనే అంచనాతోనే మోదీ.. పవన్ తుపాను అన్నారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఏపీలో ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని పవన్ సూచించారు. ఆమె పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక ఎన్నికల్లో జనసైనికులు, వీరమహిళలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారన్న పవన్ కళ్యాణ్.. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటూ ఎమోషనల్ అయ్యారు. జనసేన నేతలు లేని ఊరుంటుందేమో కానీ.. జనసైనికులు, వీరమహిళలు లేని ఊరంటూ ఉండదని కొనియాడారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T14:40:22Z dg43tfdfdgfd