MARGANI BHARAT | మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రచార రథాన్ని తగులబెట్టిన దుండగులు.. రాజమండ్రిలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ

Margani Bharat | మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్‌ ఎన్నికల ప్రచార రథానికి దుండగులు నిప్పుబెట్టారు. రాజమహేంద్రవరం వీఎల్‌ పురంలోని మార్గాని ఎస్టేట్స్‌ ఆఫీసులో ఉన్న ప్రచార రథాన్ని శనివారం రాత్రి దుండగులు తగులబెట్టారు. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి భరత్‌ ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రచార రథానికి నిప్పు పెట్టారని స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే మార్గాని భరత్‌ ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు.

ఇది టీడీపీ శ్రేణుల పనే : మార్గాని భరత్‌

తన ప్రచార రథాన్ని తగులబెట్టడంపై మార్గాని భరత్‌ స్పందించారు. ఇది అధికార టీడీపీ శ్రేణుల పనే అని అనుకుంటున్నట్లుగా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులపై టీడీపీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. రాజమండ్రిలో ఎప్పుడూ ఇలాంటి కల్చర్‌ లేదని.. ఇలా దాడులు చేయడం ఫస్ట్‌ టైమ్‌ చూస్తున్నానని అన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ఇదే హేయమైన చర్య అని మండిపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరనేది పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తే తెలుస్తుందని మార్గాని భరత్‌ తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. ఘటనాస్థలిలో సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయని.. వాటిని పరిశీలిస్తే ఎవరు వచ్చారనేది తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని చెప్పారు.

ప్రతి చిన్న విషయం రాజకీయం చేయొద్దు : ఎమ్మెల్యే వాసు

టీడీపీ కార్యకర్తలే మార్గాని భరత్‌ ప్రచార రథాన్ని తగులబెట్టి ఉంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు ) స్పందించారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయొద్దని ఆయన సూచించారు. మార్గాని భరత్‌ వాహనాన్ని తగులబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి తానే స్వయంగా చెప్పానని తెలిపారు. ఆకతాయిలను పెంచి పోషించింది వైసీపీ పార్టీనే అని మండిపడ్డారు.

2024-06-29T06:38:25Z dg43tfdfdgfd