PAWAN KALYAN | ఎస్బీఐ చైర్మన్‌గా తెలుగు వ్యక్తి సిఫార్సు కావడం గర్వకారణం : పవన్‌కల్యాణ్‌

అమరావతి : దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) నూతన చైర్మన్‌ (SBI New Chairman) గా చల్లా శ్రీనువాసులశెట్టి (Challa Srinivasula Shetty) పేరు సిఫార్సు కావడం గర్వకారణమని ఏపీ డిప్యూటీ సీఎం(Deputy CM, ) పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan | ) అన్నారు. ఈ సందర్భంగా చల్లాకు అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో ఎస్బీఐ మరిన్ని మైలురాళ్లు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రసుత్తం ఎస్బీఐ సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సీఎస్‌ శెట్టిని ఎస్బీఐ చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థల బ్యూరో(ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారస్‌ చేసింది. ప్రస్తుతం చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న దినేశ్‌ కుమార్‌ ఖారా ఈ ఏడాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో నూతన వ్యక్తిని నియమించడానికి ఎఫ్‌ఎస్‌ఐబీ పలువురు సీనియర్‌ ఉన్నతాధికారులను శనివారం ఇంటర్వ్యూ చేసింది. వీరిలో శెట్టి కూడా ఒకరు. బ్యాంక్‌లో వారి పనితీరు, అనుభవం, ప్రస్తుత పరిమితులను దృష్టిలో పెట్టుకొని చల్లా శ్రీనివాసులు శెట్టిని( CS Shetty) ఎస్బీఐ చైర్మన్‌ పదవికి సిఫారస్‌ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఐబీ (FSIB) ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆఫ్‌ ది క్యాబినెట్‌(ACC) కమిటీ సమావేశమై ఎఫ్‌ఎప్‌ఐబీ సూచించిన వ్యక్తిపై తుది నిర్ణయం తీసుకోనున్నది. జనవరి 2020లో బ్యాంక్‌ ఎండీగా నియమితులైన శెట్టి..ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌, గ్లోబల్‌ మార్కెట్స్‌ అండ్‌ టెక్నాలజీ వర్టికల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను శెట్టి బేసిక్‌ వేతనం కింద రూ.26.3 లక్షలు, డీఏ కింద మరో రూ.9.7 లక్షలు అందుకున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు ఫోర్స్‌/కమిటీలకు ఆయన సారథ్యం వహించారు.

శెట్టి విద్యాభ్యాసం..

జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడు గ్రామంలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆపై గద్వాల్‌లో ఉన్నత చదువులు చదివారు. రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి బీఏ అగ్రికల్చర్‌లో పట్టా పొందారు. ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ స్థాయిలో కేరియర్‌ ప్రారంభించిన శెట్టి..బ్యాంకింగ్‌ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నది. కార్పొరేట్‌ క్రెడిట్‌, రిటైల్‌, డిజిటల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ విధులు నిర్వహించారు. ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా, జనరల్‌ మేనేజర్‌గా కార్పొరేట్‌ అకౌంట్స్‌ గ్రూపులో విధులు నిర్వహించారు.కమర్షియల్‌ బ్రాంచ్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా కూడా పనిచేశారు.

2024-06-30T09:27:54Z dg43tfdfdgfd