చెల్లి ఒత్తిడితో అక్క హత్య

  • అన్నదమ్ముల కూతుర్ల మధ్య ప్రేమవైరం
  • వరుసకు బావైన యువకుడు మాట్లాడుతున్నడని చెల్లి కోపం
  • నీ ప్రేమను నిరూపించుకోవాలంటే అక్కను చంపాలని ఒత్తిడి
  • హత్య చేసి బావిలో పడేసిన యువకుడు
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు విచారణ
  • తాజాగా జగిత్యాల జిల్లా కోర్టు తీర్పు
  • యువకుడికి జీవిత ఖైదు

జగిత్యాల కలెక్టరేట్‌, జూన్‌ 28: చెల్లి ప్రేరణతో అక్కను హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా కోర్టు జడ్జి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు. సీఎంఎస్‌ ఎస్‌ఐ రాజూనాయక్‌ వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం ఆత్మకూరుకు చెందిన డుంగబోయిన రాణి, దీప్తిప్రియ అన్నదమ్ముల కూతుర్లు. వరుసకు బావ అయిన పాలెపు తిరుమల్‌ దీప్తిప్రియతో చనువుగా ఉండేవాడు. కొంతకాలం తర్వాత రాణితో కూడా చనువును పెంచుకున్నాడు. విషయం తెలిసిన దీప్తిప్రియ తిరుమల్‌తో మాట్లాడడం బంద్‌ చేసింది. ఎందుకు మాట్లాడడం లేదని తిరుమల్‌ అడగ్గా రాణితో ఎందుకు చనువుగా ఉంటున్నావని నిలదీసింది. దీంతో తిరుమల్‌ అదంతా అబద్ధమని బుకాయించాడు. అయితే నిజం కాకపోతే నీ ప్రేమను నిరూపించుకోవాలంటే అక్క రాణిని హతామార్చాలని ఒత్తిడి తెచ్చింది.

నిత్యం తిరుమల్‌కు మెస్సేజ్‌లు పెట్టేది. ఈ క్రమంలో తిరుమల్‌ 2016 డిసెంబర్‌ 7న మాట్లాడుదామని రాణిని బయటకు తీసుకెళ్లి మెడకు వైరు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ఓ పాడుబడ్డ బావిలో పడేశాడు. చీకటిపడ్డా రాణి ఇంటికి రాకపోండంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తిరుమల్‌పై అనుమానంతో మెట్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాడుబడ్డ బావిలో రాణి మృతదేహాన్ని గుర్తించి హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

పక్కా సాక్ష్యాధారాలు సేకరించి తిరుమల్‌, దీప్తిప్రియను అరెస్ట్‌ చేసి కోర్టుకు సరెండర్‌ చేశారు. సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించగా, పీపీ మల్లికార్జున్‌ నేరాన్ని రుజువు చేశాడు. రాణిని హత్య చేసిన తిరుమల్‌కు యావజ్జీవ శిక్షతోపాటు 5వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి నీలిమ తీర్పును వెలువరించారు. కేసును ఛేదించి నేరస్తుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులు, సీఎంఎస్‌ టీంను ఎస్పీ అశోక్‌కుమార్‌ అభినందించారు.

2024-06-28T22:06:59Z dg43tfdfdgfd