జాతి పండుగగా పీవీ జయంత్యుత్సవం

  • నెక్లెస్‌ రోడ్డులో ఘనంగా పీవీకి నివాళి
  • పుష్పాంజలి ఘటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ప్రముఖలు

బేగంపేట్‌ జూన్‌ 28: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 103 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌లో ఆయన సమాధి వద్ద శుక్రవారం పలువురు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ హనుమంతరావు, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, కోదండ రాం, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, మాజీ మంత్రులు జానారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎంపీ హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌తో పీవీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ ప్రభాకర్‌రావులు పీవీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం, పీవీ ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు, భజనలు, ఉచిత రక్తదాన శిబిరం, వైద్య శిభిరం, తాగునీటి శిబిరాలను పాటు ఏర్పాటు చేశారు.

పీవీ నర్సింహారావు బాటలోనే నడుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

నేటి ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉండటానికి మాజీ దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భూ సంస్కరణలతో పేద, దళిత వర్గాల ప్రజలకు భూమిని పంచి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారన్నారు. పీవీ బాటలనే తామంగా నడుస్తామన్నారు.

పీవీ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారు: ఎమ్మెల్యే తలసాని

దేశానికి ఎన్నో సేవలందించిన పీవీ నర్సింహారావు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆయన ఎన్నో ఉన్నతమైన పదవులు అధిష్టించి దేశ ప్రధానిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యారని కొనియాడారు. పీవీ ఖ్యాతిని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు భారతరత్న అందించాలని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. అప్పటి పీవీ నిర్ణయాలతోనే ప్రస్తుతం పరిపాలన నడుస్తున్నదన్నారు. కార్యక్రమంలో బేగంపేట్‌ కార్పొరేటర్‌ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

2024-06-28T18:36:23Z dg43tfdfdgfd