మహంకాళి బోనాలకు ఇబ్బందులుండొద్దు

  • జూలై 5 వరకు ఏర్పాట్లన్నీ పూర్తి కావాల్సిందే
  • నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు .. సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్‌

బేగంపేట, జూన్‌ 27: బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో జూలై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని, ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో జూలై 21, 22వ తేదీల్లో జరిగే మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. జూలై 5లోపు జాతర ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. 21న బోనాలు, 22న రంగం మహోత్సవాలు ఉంటాయని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉండటంతో మహిళలు జాతరకు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకు తగినట్టు ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.

ఈ సారి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ప్రభుత్వం రూ. 20 కోట్లు విడుదల చేసిందన్నారు. ఆలయాల పరిసరాల్లో లైటింగ్‌, మూడు రోజుల పాటు నిరంతరం మంచినీటి సరఫరా, విద్యుత్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా పోలీసు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్ల గురించి మంత్రికి వివరించారు. అంబారీపై అమ్మవారిని ఊరేగించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. అనంతరం మంత్రి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యార్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతరావు, కాంగ్రెస్‌ నాయకురాలు కోట నీలిమా, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, జలమండలి జీఎం వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

2024-06-27T23:54:11Z dg43tfdfdgfd