JANASENA PARTY: ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన జనసైనికులు.. ఇప్పటికీ రేకుల షెడ్డులో నివాసం

ఆయనో సామాన్య గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరారు.. ఆస్తులు లేవు, రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు అధినేత పవన్ కళ్యాణ్.. ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. మళ్లీ 2024లో పొత్తుల్లో భాగంగా ఎమ్మెల్యే టికెట్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది.. ఎన్నికల్లో పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచినా సొంత కారు కూడా లేని పరిస్థితి.. ఎంతకాదన్నా నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధి.. ఎక్కడికి వెళ్లాలన్నా కారు కచ్చితంగా అవసరమే.. కానీ కారు కొనగలిగే ఆర్థిక స్థోమత లేదు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న జనసైనికులు చేయి, చేయి కలిపారు.. ఎమ్మెల్యేలకు తమ తరఫున కారును బహుమతిగా అందజేశారు.

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరాటం రాంబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.. అయినా సరే నియోజకవర్గంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.. సీనియర్ నేత కరాటం రాంబాబు, జన సైనికులు, కూటమి నేతలు కష్టపడి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.

ఒక సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన ఎమ్మెలయే చిర్రి బాలరాజు సామాన్యమైన వ్యక్తి. నిత్యం ప్రజల్లోకి తిరగడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మారుమూల ఏజెన్సీ గ్రామాలను సందర్శించడానికి కారు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఆయన పరిస్థితిని గమనించిన సీనియర్ నేత కరాటం రాంబాబు కుటుంబం, అలాగే బుట్టాయగూడెం గ్రామ జనసైనికులు సేకరించిన కొంత డబ్బులతో ఫార్చునర్ కారు నిమిత్తం డౌన్ పేమెంట్ చెల్లించారు. మిగిలిన డబ్బుల్ని ఎమ్మెల్యే జీతంలో వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు.

తమ అభిమాన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఫార్చునర్ కారును బహుమతిగా అందజేసిన జనసైనికులు.. వారి అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. ఒక సామాన్య నిరుపేద రైతుని ఎమ్మెల్యేగా గెలిపించడమే కాదు.. మొత్తం 175 ఎమ్మెల్యేల్లో తమ ఎమ్మెల్యే ఏ మాత్రం తీసిపోడు అనే విధంగా కరాటం రాంబాబు, బుట్టాయగూడెం జన సైనికుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు కారును అందజేశారు. మొత్తానికి ఎమ్మెల్యే కోసం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన ఈ మంచిపనిని అందరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో జనసైనికులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T01:08:08Z dg43tfdfdgfd