అభిప్రాయాలను అడిగి తప్పుచేశాను

‘సినిమాటిక్‌ యూనివర్స్‌’ ఇప్పుడు ప్రపంచ సినిమాలో ఇదో ట్రెండ్‌. సీక్వెల్‌కి ఇది అప్‌డేట్‌ ట్రెండ్‌ అని చెప్పొచ్చు. సీక్వెల్‌ అంటే కథను కొనసాగించడం. ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’ అంటే ఒక సినిమాలోని పాత్రలనో, లేక ఆ సినిమా ప్రపంచాన్నో మరో సినిమాలో కొనసాగించడం. హాలీవుడ్‌ సెన్సేషన్‌ ‘అవెంజర్స్‌’ నుంచి ఈ ట్రెండ్‌ ఊపందుకుందని చెప్పొచ్చు. తమిళంలో వచ్చిన ఖైదీ, విక్రమ్‌ సినిమాలు ఈ కోవకు చెందిన చిత్రాలే. అయితే.. ఈ ఆలోచన దర్శకుడు శంకర్‌కి 2008లోనే వచ్చిందట. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.

‘ ‘రోబో’ టైమ్‌లో ఓ ఆలోచన వచ్చింది. భారతీయుడు, ఒకేఒక్కడు, శివాజీ.. ఈ మూడు సినిమాల్లోని హీరో పాత్రల్ని కలుపుతూ ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అనేది నా ఆలోచన. వెంటనే నా అసిస్టెంట్లకు ఈ ఆలోచన చెప్పాను. వాళ్లు సమాధానం ఇవ్వకపోగా నవ్వారు. వాళ్లకు ఈ ఆలోచన నచ్చలేదని అర్థమైంది. కానీ నాకెందుకో ఇది వర్కవుట్‌ అవుతుందనిపించింది. అందుకే ఇంటికెళ్లి నా భార్య, పిల్లలకు చెప్పాను. వాళ్లనుంచి సరైన స్పందనే లేదు. స్నేహితులతో చెప్పాను. వెటకారంగా నవ్వారు. నా ఆలోచనే కరెక్ట్‌ కాదని వదిలేశా. కొన్నాళ్లకు హాలీవుడ్‌లో ‘అవెంజర్స్‌’ వచ్చింది. మూవీ చూశాక, ‘మీకేదైనా కొత్త ఆలోచన వస్తే త్వరగా తీసేయ్యండి. లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు తీసేస్తారు..’ అని నా అసిస్టెంట్లకు చెప్పాను. ఆ రోజు ఎవరి అభిప్రాయాలూ ఆడక్కుండా నేను ఆ ప్రయోగం చేసుంటే.. ఇండియాలో ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’ తీసుకొచ్చిన తొలి దర్శకుడిని అయ్యేవాడ్ని’ అంటూ గతాన్ని నెమరువేసుకున్నారు శంకర్‌.

2024-06-29T20:06:47Z dg43tfdfdgfd