విభూతి.. అపర సంజీవని

భస్మ పాపం నికృంతయేన్మోక్షం దదా తీతి భగవాన్‌ కాలాగ్ని రుద్రః…

(బృహజ్జాబాల ఉపనిషత్తు తృతీయం బ్రాహ్మణం- 38)

విభూతి పాపాన్ని పోగొట్టి మోక్షం ఇస్తుందని కాలాగ్నిరుద్రుడు భుసుండునికి వివరించాడు. పాపం నాశయతే కృత్స్నమపి జన్మాంతరార్జితం

(చతుర్థం బ్రాహ్మణం- 32)

జన్మజన్మలుగా పేరుకుపోయిన పాపాన్ని సైతం విభూతి పూర్తిగా నశింపజేస్తుందని శ్లోక భావం. అంతే కాకుండా నిష్ఠగల వారికి భస్మం ప్రాణదానం చేసే సంజీవనిలాగాను పనిచేస్తుందని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్నది. వశిష్ఠుని వంశంలోని ధనంజయుడనే బ్రాహ్మణునికి నూరుగురు భార్యలు. పెద్దభార్య కొడుకు కరుణుడు. అతని భార్య శుచిస్మిత. అతను అన్నదమ్ముల వైరం కారణంగా.. భవానీ తీరంలోని నరసింహుడి దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఇంకెవరో నైవేద్యంగా సమర్పించిన నిమ్మపండు వాసన చూశాడు. అక్కడి వారు కోపంతో నూరేండ్లు అడవి ఈగవై పొమ్మని కరుణుణ్ని శపించారు. అతను భార్యతో తనను రక్షించు మన్నాడు. అంతలోనే ఈగగా మారిపోయాడు. దాయాదులు అతణ్ని నూనెలో పారవేసి చంపేశారు. శుచిస్మిత భర్త మృతదేహంతో అరుంధతి దగ్గరికి వెళ్లింది. ఆమె మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించి భస్మాన్ని ఈగ మీద చల్లింది. అది బతికింది. తర్వాత వందేండ్లు నిండాక ఒకడు ఆ ఈగను చంపడంతో శాపం తీరింది.

మరో సందర్భంలో శ్రీహరి.. శివుడి వక్షస్థలంలోని భస్మాన్ని ప్రణవంతోనూ, గాయత్రితోనూ, పంచాక్షరితోనూ అభిమంత్రించి తన శరీరానికి అలదుకొన్నాడు. శివుణ్ని ధ్యానించాడు. శివుడు దర్శనమిచ్చి విభూతిని భక్షించమని కోరగా హరి అలాగే చేశాడు. క్షణంలో శివుని ప్రతిబింబంలా తెల్లని కాంతితో శ్రీహరి వెలిగిపోయాడు. నాటి నుంచి తెల్లని కాంతి కలవాడుగా మారాడు. ‘భస్మ ప్రభావమే ఎరుగను. నీ ప్రభావం ఎలా తెలియగలను?’ అని మహావిష్ణువు.. పరమశివుణ్ని కొనియాడాడు. భస్మధారణ ప్రభావం అటువంటిదని పై రెండు ఉదంతాలు తెలియజేస్తున్నాయి. ఇదే బృహజ్జాబాల ఉపనిషత్తులో భస్మధారణ చేసిన వాడు తన భక్తుడు అవుతాడని శివుడు పేర్కొన్నట్టుగా ఉంది.

– డా॥ వెలుదండ సత్యనారాయణ

2024-06-30T22:03:09Z dg43tfdfdgfd