AP VOLUNTEERS: ఏపీలో వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఆలోచన ఏంటో చెప్పిన డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన.. పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో పింఛన్ల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ వాలంటీర్ల గురించి కామెంట్స్ చేశారు. వాలంటీర్లు లేకపోతే పింఛన్ పంపిణీ ఆగలేదు కదా.. గత ప్రభుత్వం వాలంటీర్లు లేకపోతే పింఛన్‌ల పంపిణీ ఆగిపోతుందని ఊదరగొట్టిందని విమర్శించారు. ఇప్పుడు వాలంటీర్లు లేరని.. పింఛన్ల ఆగలేదన్నారు. సచివాయాల ఉద్యోగులు పింఛన్‌లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.. కూటమి ప్రభుత్వం పింఛన్ కూడా పెంచి ఇస్తోందన్నారు.

సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి మరీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారని.. గతంలో పింఛన్ల పంపిణీ నాలుగైదు రోజులు తీసుకునేవారన్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ రాత్రి లేదా మంగళవారం ఉదయం లోగా 100 శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతుందన్నారు. వాలంటీర్లను ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి.. అనే అంశంపై ఆలోచన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలను గమనిస్తే.. ఒక్కో సచివాలయానికి పది మంది వరకు ఉద్యోగులు ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వీరందరి సేవలు వినియోగించుకుంటే.. ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయొచ్చన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కచ్చితంగా బాధ్యత, జవాబుదారీ తనం ఉంటుందని.. సచివాలయ ఉద్యోగి ఎవరైనా ఇకపై డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికీ అలా చేయరని.. ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి, కూటమి నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని.. తమ ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నంలో ఉందన్నారు. వాలంటీర్ల అంశంపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. త్వరలోనే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని.. వాలంటీర్లకు కూటమి అన్యాయం చేయబోదన్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.. అయితే ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీకి సంబంధించి వివాదం రేగింది. టీడీపీ వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుందని అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోపించింది. దీనికి టీడీపీ కౌంటర్‌గా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పింది.. అంతేకాదు వాలంటీర్లకు జీతాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారరు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటారని భావించారు.. అయితే జులై నెల పింఛన్ల పంపిణీ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించడంతో వాలంటీర్లు ఆందోళనలో ఉన్నారు. ఈ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి.. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు వాలంటీర్ల విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T08:09:19Z dg43tfdfdgfd