HARISH SHANKAR: ఏడుస్తూనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు, ఆరోజంతా బస్ స్టాప్‌లోనే పడుకున్నా - హరీష్ శంకర్

Harish Shankar About Career Struggles: సినిమాల్లోకి రావడం ఎంత కష్టమో.. ఇక్కడ సక్సెస్ అవ్వడం కూడా అంతే కష్టమని చాలామంది అంటుంటారు. అయినా కష్టమైన సరే.. సినిమాల్లోనే ఉంటాను అనుకునేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒకరు. ముందుగా రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన హరీష్.. కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. రోజుకు కనీసం ఒక్క పూట కూడా తినకపోవడం, రోడ్డు మీదే పడుకోవడం లాంటివి తన జీవితంలో కూడా జరిగాయని బయటపెట్టారు.

డబ్బులు అడగలేను..

తన తండ్రి తాను కలెక్టర్ కావాలని కలలు కన్నారని, అలా కాకుండా సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పగానే వారిద్దరి మధ్య దూరం పెరిగిందని, కనీసం డబ్బులు కూడా ఇచ్చేవారు కాదని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి నరకం చూశానని తాను ఎదుర్కున్న కష్టాల గురించి బయటపెట్టారు. ‘‘ఒక కొత్త డైరెక్టర్‌తో స్టోరీ సిట్టింగ్‌లో కూర్చునే అవకాశం వచ్చింది. ఆయన మధ్యాహ్నం అవ్వగానే నాకు, ఇంకొక అసిస్టెంట్‌కు రూ.50 ఇచ్చేవాళ్లు. కానీ నా రూ.25 నేను తీసుకొని, అందులో నుంచి రూ.20 దారి ఖర్చుల కోసం దాచుకొని రూ.5 పెట్టి ఏదో ఒకటి తినేవాడిని. డైరెక్టర్‌ను ఇంకా డబ్బులు అడుగుదామంటే ఈ మాత్రం పనికే డబ్బులా అని పంపించేస్తారేమో అనే భయంతో అడగలేదు’’ అని స్టోరీ సిట్టింగ్స్‌తో తన కెరీర్ ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు హరీష్.

ఏడుస్తూనే ఉన్నాను..

‘‘దాదాపు 3,4 ఏళ్లు గొడ్డు చాకిరీ చేశాను. అప్పుడే నేను స్టోరీ సిట్టింగ్‌లో పాల్గొన్న డైరెక్టర్‌కు మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది. రెండేళ్లు ఆయనతో ట్రావెల్ చేశాను కాబట్టి నేను కూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయిపోవచ్చు అని చూస్తే ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఆయనను వెళ్లి అడిగితే నువ్వు లేకుండా షూటింగ్ ఏంటి, రేపు ఓపెనింగ్‌కు వచ్చేయ్ అన్నారు. అక్కడ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లిస్ట్‌లో చూస్తే నా పేరు లేదు. అంతే.. కళ్ల నుంచి నీళ్లు కారి ఆ పేపర్ మీద పడింది. నా వల్ల పేపర్ పాడయిపోయిందని తీసేసుకున్నారు కానీ.. ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడగలేదు. ఏడుపు ఆగట్లేదు, బస్ ఎక్కి ఏడుస్తూనే ఉన్నాను. నేను న్యూజిలాండ్ వెళ్లిపోతానని నా ఫ్రెండ్‌తో చెప్తే అదంత ఈజీ కాదని మందలించాడు’’ అని తన మూడేళ్ల కష్టం ఎలా వృధా అయ్యిందో చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.

బస్ స్టాప్‌లో పడుకున్నా..

‘‘స్టోరీలో డౌట్స్ ఉన్నప్పుడు పిలిచేవారు. అలా నేను కూడా ఆర్టిస్టులకు డైలాగ్స్ చెప్తూ షూటింగ్‌లో సెటిల్ అయిపోయాను. ఒకరోజు అర్థరాత్రి 2 గంటల వరకు షూటింగ్ చేశాం. అప్పటికే లాస్ట్ బస్ కూడా వెళ్లిపోయింది. ఫ్రెండ్ వాళ్ల రూమ్‌కు వెళ్తే వాడి ఇంటికి ఫ్యామిలీ వచ్చారని అన్నాడు. అమీర్‌పేట్ బస్ స్టాప్‌కు వెళ్లాను. అక్కడ షాప్ నుంచి బయటపడేసిన కాటన్ బాక్సులు ఉన్నాయి. అవి తీసుకొని బస్ స్టాప్‌లో వేసుకొని 2 గంటలు పడుకున్నాను. మరీ బస్ స్టాప్‌లో పెరిగిన వాడిని కాదు కానీ ఆరోజు అలా జరిగింది’’ అంటూ ఆఖరికి బస్ స్టాప్‌లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు హరీష్ శంకర్. అన్ని కష్టాల తర్వాత ప్రస్తుతం టాలీవుడ్‌లో తనకంటూ డైరెక్టర్‌గా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు.

Also Read: శ్రీరెడ్డికి నేను డబ్బులు ఇవ్వలేదు, ఆ విషయంలో ఇప్పటికీ సపోర్ట్ చేస్తాను - జర్నలిస్ట్ మూర్తి

2024-04-27T07:31:04Z dg43tfdfdgfd