SAICHAND | సాయిచంద్‌ లోటు పూడ్చలేనిది.. సాయి కుటుంబానికి అండగా ఉంటాం

  • మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు
  • హస్తినాపురంలో మొదటి వర్ధంతి సభ

Saichand | వనస్థలిపురం, జూన్‌ 29: కవి, గాయకుడు వేద సాయిచంద్‌ లేనిలోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సాయిచంద్‌ మొదటి వర్ధంతి సభను హస్తినాపురంలోని జీఎస్సార్‌ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సాయిచంద్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో, నిర్మాణంలో సాయిచంద్‌ పాట ఎంతో ప్రభావం చూపిందని చెప్పారు. ఎక్కడ కేసీఆర్‌ సభ జరిగినా అక్కడ సాయిచంద్‌ పాట ఉండేదని గుర్తు చేశారు. గొప్ప కళాకారుడిని బీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణ సమాజం కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రవహించే నదిలా సాయి మాట, పాట

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ సాయి పాట, మాట ప్రవహించే నదిలా ఉండేదని అన్నారు. ప్రతి సభలోనూ సాయి తన మాట, పాటలతో చైతన్యం నింపేవారని చెప్పారు. చట్టసభల్లో అడుగుపెట్టాలన్న కోరిక సాయికి ఉండేదని, ఆ కోరికను కేసీఆర్‌ తీరుస్తాడని తమతో అనేవాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, బాల్క సుమన్‌, రసమయి బాలకిషన్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌, దేవీ ప్రసాద్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు.

ఉద్విగ్నంగా రజినీ ప్రసంగం

సాయిచంద్‌ వర్ధంతి సభలో ఆయన సతీమణి రజినీ ప్రసంగం ఉద్విగ్నంగా సాగింది. గుండెనిండా దు:ఖంతో ఆమె సాయిచంద్‌ జ్ఞాపకాలను వివరించారు. అనంతరం సాయిచంద్‌ తండ్రి తన కొడుకుపై పాడిన పాట సభికులను కంటతడి పెట్టించింది. కవులు, కళాకారులు సాయిచంద్‌పై రూపొందించిన సీడీని మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఆవిష్కరించారు.

2024-06-29T22:26:05Z dg43tfdfdgfd