TAMANNAAH BHATIA: 7వ తరగతిలో తమన్నా, రణ్‌వీర్ సింగ్ పాఠాలు.. మండిపడుతున్న తల్లిదండ్రులు

Tamannaah Bhatia: స్కూలు విద్యార్థులు చదివే పాఠ్యాంశాల్లో గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను పొందుపరుస్తారు. వారు చేసిన గొప్ప పనులను చదివి.. ఆ విద్యార్థులు కూడా భవిష్యత్‌లో అలాంటి వారిలా ఎదగాలని.. వారి నుంచి స్ఫూర్తి పొందాలని ఇలా పాఠాలను చేర్చుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా సెలబ్రిటీల జీవితాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చడం తీవ్ర దుమారానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే తాజాగా స్కూలు పాఠ్యాంశాల్లో హీరోయిన్ తమన్నా భాటియా, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌లకు చెందిన జీవితాలను చేర్చడం సంచలనం సృష్టించింది. కర్ణాటకలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేయడంపై బెంగళూరులో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. హెబ్బాళలోని సింధీ ఉన్న­త పాఠశాలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సింధీ పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లోని ఏడో చాప్టర్‌లో సింధీ వ్యక్తుల గురించి ఓ పాఠాన్ని పొందుపరిచారు. ఆ పాఠంలో తమన్నాతోపాటు రణ్‌వీర్‌ సింగ్‌ల జీవితాలను కూడా పాఠ్యాంశంగా చేర్చడం ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణం అయింది.

సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ.. అర్ధ ­నగ్నంగా నటించే హీరోయిన్ తమన్నా భాటియా జీవితాన్ని విద్యార్థులకు పాఠాలుగా బోధించడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రు­లు మండిపడుతున్నారు. సింధీ సామాజిక వర్గంలో ఎంతోమంది కళాకా­రు­లున్నారని.. వారి జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా చేరిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇలా తాము తమన్నా పాఠాలను వ్యతిరేకించినందుకు.. విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించేస్తామని పాఠశాల యాజ­మాన్యం బెదిరిస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. ఆ సింధీ పాఠశాల యాజమాన్యం తాము చేసిన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే తమన్నా జీవితం గురించి ఇచ్చింది పాఠం కాదని.. పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సింధూ ప్రాంత విభజన అనంతరం.. ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు దాన్ని పాఠ్యాంశంగా ముద్రించినట్లు ఆ పాఠశాల యాజమాన్యం పేర్కొంది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా భాటియా, రణ్‌వీర్ సింగ్.. సినీ రంగంలో ఎన్నో విజ­యాలు సాధించడంతో వారి జీవితాలను పాఠ్యాంశంగా చేర్చినట్లు వివరించింది.

ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కర్ణాటకలోని అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో సదరు పాఠశాల, సీబీఎస్ఈ బోర్డును సంప్రదించగా.. ఈ వ్యవహారంపై మ‌ట్లాడేందుకు వారు నిరాకరించడం గ‌మ‌నార్హం.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-28T10:12:03Z dg43tfdfdgfd