ఇలా చేస్తే పనిలో కూడా రిలాక్సేషన్​ లభిస్తుంది...

ఇలా చేస్తే పనిలో కూడా రిలాక్సేషన్​ లభిస్తుంది...

రోబో సినిమాలో రజనీకాంత్ రోబోను తయారుచేసేటప్పుడు హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ను పట్టించుకోడు. ఫోన్ వస్తే కట్ చేస్తాడు. మెసేజ్ లు వచ్చినా చూడడు. దాంతో హీరోయిన్ కు కోపం వస్తుంది. కానీ పని పూర్తయ్యాక హీరోయిన్ను బతిమిలాడుకుంటాడు. పనిలో మునిగిపోయాక పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకపోవడం మేధావుల లక్షణం అనేది ఇక్కడ రజనీకాంత్ క్యారెక్టర్ ను బట్టి అర్థమవుతుంది. అందరూ మేధావులు కాకపోయినా.. చేసే పని మీద ఏకాగ్రత ఉండాలి.

వాడేంట్రా.  అలా పని చేస్తాడు. విసుగు రాదా? అంటారు. విశ్రాంతి కూడా తీసుకోకుండా పనిచేస్తుంటే.. పని రాక్షసుడని బిరుదిచ్చేస్తారు. కొందరు విసుగు, విరామం లేకుండా పనిలో మునిగిపోయి ఉంటారు. అలాంటి వాళ్లను చూస్తుంటే... వీళ్లు పనికోసమే పుట్టారా అనిపిస్తుంది. అలా మనమెందుకు కష్టపడలేమని అసూయ కూడా పుడుతుంది. అతిగా కష్టపడడం అందరికీ ఎందుకు కుదరదు అంటే.. కారణాలు చాలానే ఉన్నాయి..

ఇష్టపడాలి

ఒక పనిని ఆపకుండా చేయాలంటే, మంచి ఫలితాలు పొందాలంటే.. ముందు ఆ పనిని ఇష్టపడాలి. మన అనుకున్న వాళ్లను ఎలా ప్రేమిస్తామో.. చేసే పనిని కూడా అలాగే ప్రేమించాలి. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ ఇష్టం పెరగాలి. అంతేకానీ పని మీద కోపం పెంచుకోకూడదు. పక్కవాళ్ల సలహాలు విని పనిని వదిలేయకూడదు. అలాగే చేసే కొద్దీ దానిలోంచి వచ్చే ఫలితాలను ఆస్వాదించగలగాలి. పని పూర్తయ్యే వరకు దానిపై పెంచుకున్న ఇష్టంలో మార్పు రాకూడదు. మొదట ఎంత ఇష్టంతో మొదలుపెట్టామో.. చివరి వరకు అంతే ఇష్టం ఉండాలి. అవసరం అయితే పని చేసేటప్పుడు ఇల్లు, కుటుంబం, ఫ్రెండ్స్ కంటే పని మీదే దృష్టి పెట్టాలి.

సులువైన మార్గాలు

కొందరు పనిని చేయడాన్ని ఇష్టపడతారు. కానీ ఆ పనిని చేసే సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో తప్పటడుగు వేస్తారు. దాంతో పని మీద పూర్తిగా దృష్టి పెట్టలేరు. అందుకే ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి అనేదాని గురించి ఆలోచించి, సులభంగా, తేలికైన, నచ్చిన మార్గాలను ఎంచుకోవాలి. లేదంటే తప్పకుండా మధ్యలో విసుగు వస్తుంది. లేదా వదిలేయాలనిపిస్తుంది. కానీ కొందరు పనిలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయరు. కసిగా పనిచేస్తారు. అంతు చూస్తాం అని చివరి వరకు వదిలిపెట్టరు. అలాంటి వాళ్లే విజయం సాధిస్తారు.

రిలాక్సేషన్

పనిలో రిలాక్సేషన్ ఏంటీ? రిలాక్సేషన్ కోసమే పని చేస్తాం  అంటారు కొందరు. వాళ్ల దృష్టితో ఆలోచిస్తే అది కరెక్టే అనిపిస్తుంది, కానీ అలా చేయాలంటే..

 
  •  బరువు బాధ్యతలు తగ్గించుకోవాలి.
  •  ఇతర ఇష్టాలు, ఆలోచనలు ఉండకూడదు.
  •  సరదాలు, సంతోషాలు, సుఖాలు తగ్గించుకోవాలి.
  •  పనిచేసేటప్పుడు మనసు దానిపైనే పెట్టాలి.
  •  కోపం, అసూయ, ద్వేషం లాంటి చెడు గుణాలు ఉండకూడదు.
  •  మనసుపై కంట్రోలింగ్ పవర్ ఉండాలి.
  • చిన్నచిన్న విషయాలను పట్టించుకోకూడదు.
  •  తనను తాను గొప్ప వ్యక్తిగా ఊహించు కోవాలి. అందుకు తగ్గట్టు కష్టపడాలి. 
  •  మనసు, శరీరం విశ్రాంతి కోరుకోకుండా వాటికి నచ్చజెప్పాలి.
©️ VIL Media Pvt Ltd.

2024-06-28T14:25:45Z dg43tfdfdgfd