ఎంతగొప్ప విజయం తల్లీ ... సివిల్స్ ర్యాంకర్ అనన్య పేరెంట్స్ కళ్లలో ఆనందం చూడండి

హైదరాబాద్ : ఐఎఎస్, ఐపిఎస్ కావాలని అందరూ కలగంటారు... కానీ ఆ కలని కొందరుమాత్రమే నిజం చేసుకుంటారు. ఇలా తన కలను నిజం చేసుకుందో తెలంగాణ ఆడబిడ్డ. తాజాగా వెలువడ్డ సివిల్ సర్విసెస్ 2023 ఫలితాల్లో పాలమూరు అమ్మాయి అనన్య రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయి ఈ అద్భుత ర్యాంక్ సాధించింది అనన్య.  దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  

అనన్య విద్యాభ్యాసం : 

సివిల్స్ విజేత అనన్య రెడ్డి బాల్యమంతా మహబూబ్ నగర్ లోనే గడిచింది.  అడ్డాకుల మండలం పొన్నకల్ అనన్య సొంతూరు. తల్లి గృహిణి కాగా తండ్రి చిరు వ్యాపారి. చదువువిలువ తెలిసిన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను బాగా చదివించారు.  

అనన్య ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మహబూబ్ నగర్ లోని గీతం హైస్కూల్ లో సాగింది. పదో తరగతి వరకు అక్కడే చదివిన అనన్య ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో, డిగ్రీ న్యూడిల్లీలో చేసింది. డిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో చదివే సమయంలోనే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించింది.    

సివిల్స్ ప్రిపరేషన్ : 

డిగ్రీ తర్వాత సివిల్స్ పరీక్షకోసం ప్రిపరేషన్ ప్రారంభించింది అనన్య రెడ్డి. ఎంతో కఠినమైన ఈ   సివిల్స్ ఎగ్జామ్ కోసం చాలామంది కోచింగ్ తీసుకుంటారు... కానీ అనన్య కోచింగ్ ను నమ్ముకోలేదు. కేవలం ఆప్షనల్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీపై పట్టు సాధించేందుకు హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నారు. మిగతా అన్ని సబ్జెక్ట్స్ సొంతంగానే ప్రిపేర్ అయ్యింది. 

ఓ ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగించేదానినని... రోజుకు 12 నుండి 14 గంటలు చదువుకు కేటాయించానని అనన్య తెలిపారు. ఎంతో కఠినంగా వుండే సివిల్స్ పరీక్ష కోసం అంతే కఠినంగా ప్రిపేర్ అయ్యాయని తెలిపారు. ప్రిలిమ్స్ లో విజయం సాధించి మెయిన్స్ కు అర్హత సాధించిన తర్వాత ప్రిపరేషన్ కు మరింత సమయం కేటాయించానని తెలిపారు.     ఎంతో కష్టపడి చదివితే ఈ ర్యాంక్ సాధ్యమయ్యిందని అనన్య రెడ్డి తెలిపారు.

సివిల్స్ సర్విసెస్ సాధించాలన్నది తన కల... అందుకు తగ్గట్లుగానే కష్టపడి ప్రిపేర్ అయినట్లు తెలిపారు. కానీ మొదటి ప్రయత్నంలోనే ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఊహించలేనని ... ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్ సాధించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సివిల్స్ వైపు అడుగులు వేసినట్లు అనన్య తెలిపారు. 

ఇక తమ బిడ్డ సివిల్స్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. తమ బిడ్డను ముద్దాడుతూ ఆ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేసారు. తమ కుటుంబంలో ఇప్పటివరకు సివిల్స్ స్థాయిలో చదువుకున్నవారు ఎవరూ లేరని...  కానీ అనన్య ఎంతో కష్టపడి చదివి తొలి సివిల్స్ ర్యాంకర్ గా నిలిచిందని తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు. ఐపిఎస్ అధికారిగా తమ బిడ్డ ప్రజలకు మంచి చేస్తూ ఉత్తమ అధికారిణిగా గుర్తింపు పొందాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. 

సివిల్స్ లో ర్యాంకులు సాధించిన తెలుగు బిడ్డలు : 

యూనియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్ (యూపిఎస్సి) 2023 లలో నిర్వహించిన సివిల్స్ సర్వీసెస్ పరీక్షలు పది లక్షల మందికి పైగా రాసారు. వీరిలో కేవలం 1016 మంది మాత్రమే ఎంపికయ్యారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా సివిల్ సర్వెంట్స్ ను ఎంపికచేస్తుంది యూపిఎస్సి.  

సివిల్స్ సాధించిన 1,016 మందిలో 50 మంది తెలుగువాళ్లు  వున్నారు.  అనన్య ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించగా సాయికిరణ్ 27, కౌశిక్ 82 ర్యాంకులతో టాప్ 100 లో నిలిచారు. సివిల్స్ సాధించిన తెలుగువారిలో చాలామంది అమ్మాయిలు వున్నారు. 

గతంలోనూ తెలంగాణకు థర్డ్ ర్యాంక్ : 

యూపీఎస్సి 2022 ఫలితాల్లో కూడా ఇప్పటిలాగే తెలంగాణ అమ్మాయి ఉమా హారతికి మూడో ర్యాంక్ వచ్చింది.  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ఉమా 2022  సివిల్స్ లో థర్డ్ ర్యాంక్ సాధిస్తే 2023 లో అనన్య రెడ్డి ఆ ఫీట్ సాధించారు.  ఇలా ఆడబిడ్డలు చదువులో మెరుస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. 

సివిల్స్ ర్యాంకర్లకు సీఎం రేవంత్ అభినందనలు : 

సివిల్స్ 2023 ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో సత్తాచాటి ర్యాంకులు సాధించిన తెలుగు అభ్యర్ధులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డ అనన్య రెడ్డి థర్డ్ ర్యాంక్ సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేసారు. ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి. 

2024-04-17T03:29:25Z dg43tfdfdgfd