చీకటిని చిదిమి విద్యాజ్యోతిగా వెలిగి

చూపు లేదని హేళన చేసిన వారికి చెంపపెట్టులా ఐఐఎంలో సీటు సాధించింది ఆ అమ్మాయి. కనులు లేవని కలత పడకుండా.. వైకల్యాన్నిఅధిగమించి, ఉన్నత విద్యను అభ్యసించి.. సమున్నత లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన పోటీ పరీక్ష క్యాట్‌ (కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)ను క్రాక్‌ చేసింది. 93.3 శాతంమార్కులు సాధించి.. ఐఐఎం- ఇండోర్‌లో ఎంబీయేలో సీటు దక్కించుకుంది.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన కొత్తకాపు శివాని రెడ్డి.. ఇప్పుడు ఓ విద్యాజ్యోతి. మల్టీనేషనల్‌ కంపెనీకి సీఈవో కావాలన్నదే తన లక్ష్యం అంటున్న తెలంగాణ తేజాన్ని ‘జిందగీ’ పలకరించింది.

శివాని తల్లిదండ్రులు విజయలక్ష్మి, వేణుగోపాల్‌రెడ్డి. ఈ రైతు దంపతులకు ఆమె రెండో సంతానం. దృష్టిలోపంతో పుట్టిన బిడ్డకు దిష్టి తీసి పొత్తిళ్లలోకి ఆహ్వానించారు. వైద్యులకు చూపించినా చూపు రాదని తెలిసి కుమిలిపోయారు. అంతలోనే తేరుకొని తమ కండ్లతో చూసిన విషయాలన్నీ బిడ్డకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. అపురూపంగా పెంచారు. వైకల్యాన్ని అధిగమించేలా చదువు చెప్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌ బేగంపేటలోని ‘దేవనార్‌ స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌’లో చేర్పించారు. ఓనమాలు కూడా బ్రెయిలీ లిపిలో దిద్దింది శివాని. ఒకటో తరగతి నుంచి పది దాకా అక్కడే చదివింది. కంప్యూటర్‌ శిక్షణ పొందింది. పదో తరగతిలో 8.3 జీపీఏ స్కోర్‌ చేసి వైకల్యంపై మొదటి విజయం సాధించింది.

చెన్నైలో బీబీఏ

ఇంటర్‌ జహీరాబాద్‌లోనే కొనసాగించింది. పట్టుదలతో చదివి 92.1 శాతం మార్కులు సాధించి తన బ్యాచ్‌లోనే టాపర్‌గా నిలిచింది. అంధత్వంపై శివాని సాధించిన రెండో విజయం ఇది. తర్వాత ఉన్నత విద్య కోసం చెన్నై చేరింది. అక్కడి సత్యభారతి యూనివర్సిటీలో బీబీఏ కోర్సులో చేరింది. 90 శాతం మార్కులతో డిగ్రీ పట్టా అందుకుంది. అక్కడితో ఆగిపోతే తనకు ముందుచూపు లేదనుకుంటారని భావించింది. ఐఐఎం సీటు లక్ష్యంగా పెట్టుకొని క్యాట్‌ పరీక్షకు సిద్ధమైంది. చెన్నైలోనే మాక్‌-క్యాట్‌ అనే ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంది. అహరహం శ్రమించింది. సర్వశక్తులూ ఒడ్డి తన అంధత్వానికి సవాలు విసిరింది. ఆమె పట్టుదలకు వైకల్యం మూడోసారీ తోకముడిచింది. క్యాట్‌లో 93.3 శాతం మార్కులు తెచ్చుకుంది. పదహారు ఐఐఎం కాలేజీల్లో సీటు పొందే అర్హత సాధించింది. తాను సాగించాల్సిన ప్రయాణం మరెంతో ఉందని శివానికి తెలుసు. అందుకు అస్త్రశస్ర్తాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసు. అందుకే ప్రతిష్ఠాత్మమైన ఐఐఎం-ఇండోర్‌ను ఏరికోరి ఎంచుకుంది. శివాని సోదరి భవాని పాక్షికంగా అంధురాలు. క్యాట్‌ పరీక్షలో 65 శాతం మార్కులు సాధించిన ఆమెకు… హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంబీయే సీటు వచ్చింది.

లక్ష్యం ఇంకా పెద్దది

‘చూపులేదని నేను ఏనాడూ చిన్నబోలేదు… నేను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, తోబుట్టువుల సహకారం, గురువుల మార్గనిర్దేశకత్వం నన్ను నడిపిస్తున్నాయి. చిన్నప్పుడు నాకు చూపు వస్తుందని అమ్మానాన్న నన్ను చూపించని ఆస్పత్రి లేదు. అయితే, చూపు వచ్చే అవకాశమే లేదని తెలిశాక వాళ్లు కుంగిపోలేదు. నాకు చూపయ్యారు. నన్ను బాగా చదివించి.. విజ్ఞాన నేత్రాన్ని ప్రసాదించాలని భావించారు. అందుకు అనుగుణంగా ఎన్నో కష్టాలకోర్చి నన్ను చదివించారు. పదో తరగతి దాక నాలాంటి చూపులేని పిల్లల మధ్యే చదివాను. ఇంటర్‌లో కామన్‌ కాలేజీలో చేరాను. సాటి విద్యార్థులు నన్ను అంతగా చేరదీయలేదు. కానీ, నా పట్టుదల చూశాక అందరూ నాతో కలిసిపోయారు. చెన్నైలో డిగ్రీ చదవడం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. కొత్త ప్రదేశాలను చూడాలన్న నా కోరికా తీరింది. చూపు లేకున్నా.. నేను మనో నేత్రంతో దర్శించగలను. ఐఐఎంలో సీటు రావడంతో నా ప్రయాణం మళ్లీ మొదలైంది. మల్టీనేషనల్‌ కంపెనీకి సీఈవో కావాలన్నది నా లక్ష్యం. తప్పకుండా సాధిస్తానన్న నమ్మకం ఉంది. చూపులేని వాళ్లు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నేను ఏనాడూ నిస్పృహకు గురవ్వలేదు. మనల్ని హేళన చేసేవాళ్లు చాలామంది ఉంటారు. వాళ్లు మెచ్చుకునే స్థాయికి ఎదగాలి. అంధుడైనా తనకంటూ అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకున్న పోల్‌వాల్ట్‌ ప్లేయర్‌ మైఖేల్‌ స్టోన్‌ నాకు ఆదర్శం’ అని అంటున్న శివాని కలలు నిజం కావాలని

మనమూ కోరుకుందాం.

– కాకోళ్ల నాగరాజు, సంగారెడ్డి

2024-06-28T22:34:22Z dg43tfdfdgfd