నెగెటివ్‌ రోల్స్‌ ఇష్టం

‘శతమానం భవతి’ అంటూ బుల్లితెరకు పరిచయమైన నటి నీలిమ. ఇల్లాలిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే నటనలోనూ రాణిస్తున్నది. యాక్టర్‌గానే కాకుండా యూట్యూబర్‌, ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ సత్తా చాటుతున్నది. నెగెటివ్‌ పాత్రల్లోనే నటనకు అవకాశం ఉంటుందని, అవకాశం వస్తే సైకో కిల్లర్‌ పాత్రల్లో నటించాలని ఉందంటున్న నీలిమ జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..

సీరియల్స్‌లో నటించడం కష్టం కాదు. కానీ డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకోవడం చాలా ఇబ్బంది. అందుకే ఒకేసారి రెండు మూడు సీరియల్స్‌లో చేయడానికి కుదరడం లేదు. చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ, డేట్స్‌ కుదరక ఒప్పుకోవడం లేదు. మెయిన్‌ లీడ్‌గానూ చాన్స్‌లు పలకరించాయి. కానీ, కుటుంబంతో గడిపే సమయం మిస్సవుతుందని నో చెప్పాను.

మాది వైజాగ్‌. నటి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, పరిశ్రమలో నా స్నేహితుల ప్రోత్సాహంతో నటనను కెరీర్‌గా ఎంచుకున్నా. ముఖ్యంగా నా చిన్ననాటి స్నేహితురాలు హిమజ కారణంగా సీరియల్స్‌లోకి వచ్చాను. చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నా. ప్రదర్శనలు కూడా ఇచ్చాను. నిజానికి నేను చాలా ఇంట్రావర్ట్‌ని. దాంతో ఎక్కువమంది స్నేహితులు ఉండేవారు కాదు. పైగా మా నాన్న చాలా స్ట్రిక్ట్‌. అందువల్ల స్కూల్‌, ట్యూషన్‌, డ్యాన్స్‌ క్లాస్‌, ఇల్లు.. ఇదే నా ప్రపంచం. కొన్నాళ్లు సంగీతం కూడా నేర్చుకున్నా. చిన్నప్పుడు టీవీ చూసి అందులో కనిపించడం మనకు సాధ్యం కాని పని అనుకునేదాన్ని. కానీ, ఈ రోజు నేను నటిగా ప్రేక్షకులను మెప్పిస్తున్నా అంటే నమ్మలేకపోతున్నా.

హిమజ ప్రోత్సాహంతోనే..

నాకు అసలు యాక్టింగ్‌లో ఓనమాలు కూడా రావు. కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఆసక్తి ఉండేది. నేను పరిశ్రమలోకి రావడానికి కర్త, కర్మ, క్రియ హిమజనే. తనే నాకు మొదటి సీరియల్లో అవకాశం ఇప్పించింది. మా తల్లిదండ్రులను మాత్రమే కాదు నా భర్తను కూడా ఒప్పించింది. నా భర్తకు పరిశ్రమపై అవగాహన లేదు. కేవలం నాకోసం ఒప్పుకొన్నారు. మా అత్తింటివాళ్లు కూడా అంతే. నాకు నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛనిచ్చారు.

మా అబ్బాయి అడుగుతాడు..

మాకు ఒక బాబు. పిల్లాడితో మొదట్లో కొన్నాళ్లు ఇబ్బందిపడినా నా భర్త ప్రోత్సాహంతో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నా. దాదాపుగా నేను చేసినవన్నీ నెగెటివ్‌ పాత్రలే. దాంతో మా అబ్బాయి ‘ఎందుకు మమ్మీ.. అందరినీ ఏడిపిస్తావు?’ అని అడుగుతూ ఉంటాడు. నా షోస్‌ చూసి చాలా ఎంజాయ్‌ చేస్తాడు. ఒక కామన్‌ గర్ల్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఐదేండ్ల క్రితమే ‘Cool by neel telugu vlogs’ పేరుతో ఓ యూట్యూబ్‌ చానెల్‌ స్టార్ట్‌ చేశా. అందులో మేకప్‌ టిప్స్‌, వంటలు, చిట్కాలు, షాపింగ్‌, నా సీరియల్‌ కబుర్లు.. ఇలా రకరకాల వీడియోలు పోస్ట్‌ చేస్తుంటాను. దాదాపు లక్షమంది దాకా సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారు. అందరూ నా సీరియల్స్‌ గురించి, నా యాక్టింగ్‌ గురించి కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. నేను చేస్తున్నవి నెగెటివ్‌ పాత్రలు కావడంతో.. కొన్నిసార్లు నెగెటివ్‌ కామెంట్స్‌ కూడా వస్తుంటాయి. మొదట్లో వాటిని చూసి చాలా బాధపడేదాన్ని. కానీ, సోషల్‌ మీడియాలో ఇవన్నీ సాధారణమే అని తర్వాత అర్థమైంది.

సెల్ఫీ కావాలన్నాడు..

సైకో థ్రిల్లర్‌ కథల్లో నటించాలనేది నా కోరిక. నెగెటివ్‌ పాత్రల్లో నేను బాగా నటించగలనని నమ్ముతాను. జీ తెలుగులో నటిస్తున్న ‘జగద్ధాత్రి’ సీరియల్లోనూ ఇదే తరహా పాత్ర పోషిస్తున్నాను. అందులో నా పాత్ర పేరు నిషిక. చాలామంది అసలు పేరుతో కాకుండా.. నిషిక అని పిలుస్తుంటారు. ఓసారి షాపింగ్‌కి వెళ్తే ఓ పెద్దావిడ పిలిచి ‘నీ నటన చాలా బాగుందమ్మా.. మా కాలంలో వచ్చిన సినిమాల్లోని లేడీ విలన్స్‌ని గుర్తుచేస్తున్నావు’ అని మెచ్చుకున్నారు. ఇటీవల తిరుపతి, శ్రీకాళహస్తి యాత్రకు వెళ్లినప్పుడు ఒకాయన తన కూతురిని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. ‘మా అమ్మాయి మీతో సెల్ఫీ కావాలని ఏడుస్తోందండీ’ అన్నారు. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకూ.. అందరికీ నచ్చేలా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

2024-06-28T22:19:19Z dg43tfdfdgfd