బలవంతంతో హీరోయిన్ అయిన సౌందర్య కోరుకున్న జీవితం వేరు, అది తీరకుండానే మరణం..!

అసలు సౌందర్య హీరోయిన్ కావాలని అనుకోలేదట. ఒకరి బలవంతం మీద పరిశ్రమకు వచ్చారట. ఆమె కోరుకున్న జీవితం ఏమిటో నటి ఆమని బయటపెట్టింది. అది తీరకుండానే కన్నుమూసిందని కీలక వ్యాఖ్యలు చేసింది. మరి సౌందర్య కోరుకున్న ఆ జీవితం ఏమిటో తెలుసా... 

 

కన్నడ అమ్మయిన సౌందర్యను తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. చాలా మంది సౌందర్య తెలుగమ్మాయే అనుకునేవారు. 1992లో సౌందర్య కెరీర్ కన్నడ పరిశ్రమలో మొదలైంది. ఆమె స్టార్ గా ఎదిగింది మాత్రం టాలీవుడ్. 1993లో విడుదలైన మనవరాలి పెళ్లి ఆమె ఫస్ట్ తెలుగు మూవీ. 

 

ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యకు బ్రేక్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు చిత్రాల్లో సౌందర్య హీరోయిన్ గా నటించింది. అవి రెండు సూపర్ హిట్ అయ్యాయి. నెంబర్ వన్, హలో బ్రదర్, మేడమ్ చిత్రాలతో సౌందర్య స్టార్డమ్ తెచ్చుకుంది. అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. 

 

ఒక దశాబ్దం పాటు సౌందర్య సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. అనూహ్యంగా 2004లో కన్నుమూశారు. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య తన సోదరుడితో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగుళూరు నుండి కరీంనగర్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించింది. 

 

అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య మరణం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచింది. వందకు పైగా చిత్రాల్లో నటించిన సౌందర్యకు అసలు నటి కావడం ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఆమె క్లోజ్ ఫ్రెండ్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

ఆమనికి సౌందర్య చాలా క్లోజ్. ఇద్దరూ కన్నడ వాళ్ళు కావడంతో బాగా కలిసిపోయేవారట. ప్రతి విషయం ఆమనితో సౌందర్య షేర్ చేసుకుందట. ఈ క్రమంలో సౌందర్య గురించి చాలా విషయాలు ఆమనికి తెలుసు. అసలు హీరోయిన్ కావడం సౌందర్యకు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న బలవంతం మీద పరిశ్రమకు వచ్చిందని ఆమని అన్నారు. తండ్రి మరణించాక అన్నయ్యను అదే స్థాయిలో ఆమె గౌరవించారని అని ఆమని వెల్లడించారు. 

 

తండ్రి ఒత్తిడితో సినిమాల్లోకి వచ్చాక..  తర్వాత ఇంట్రెస్ట్ కలిగి చేసింది. కానీ ఆమెకు సాధారణ జీవితం ఇష్టం. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహిణిగా ఉండాలని కోరుకునేది. నటిగా ఎంతో కీర్తి గడించిన సౌందర్య ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిందని ఆమని ఆవేదన చెందారు. 2003 ఏప్రిల్ నెలలో జి రఘు అనే వ్యక్తిని సౌందర్య వివాహం చేసుకుంది. పెళ్ళైన ఏడాది లోపే మరణించింది. ఆమె కోరుకున్న జీవితం అనుభవించక ముందే ఆమె కన్నుమూశారు. 

2024-07-01T12:05:57Z dg43tfdfdgfd