వైరల్ అలర్ట్

  • సీజనల్‌ వ్యాధుల ముప్పు
  •  పెరుగుతున్న డెంగీ, మలేరియా కేసులు
  • శుభ్రత పాటించాలని వైద్యుల సూచన
  • కంపు కొడుతున్న కాలనీలు.. పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్‌ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విషయం కాదు. వర్షాలు పూర్తిగా కురవక ముందే దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, జ్వరం వంటి వ్యాధులతో జనం దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.

ఖలీల్‌వాడి, జూన్‌ 30 : వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్‌ వ్యాధుల విజృంభణ మొదలైంది. ఇటీవల కురిసిన మోస్తరు వర్షాలతో పల్లె, పట్టణాలను జ్వరాలు చుట్టుముట్టాయి. కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్ర వాతావరణం తదితర కారణాలతో సీజనల్‌ వ్యాధులు దరి చేరుతాయి. గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండడం, వర్షంలో తడవడంతో జలుబుతోపాటు వైరల్‌ ఫీవర్లు నమోదయ్యే అవకాశం ఉన్నది. వైరస్‌, బ్యాక్టీరియాలు ఆహారం, నీటిలో కలిస్తే అతిసార, డయేరియా, నీళ్ల విరోచనాలు, రక్తవిరోచనాలు అవుతాయి. వైరల్‌ ఫీవర్‌తోపాటు డెంగీ సైతం వస్తుండడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమయ్యింది. డాక్టర్లు, వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసి, అత్యవసరం ఉంటే తప్ప ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో ఎవరికైనా జ్వరం వచ్చిందనే సమాచారం రాగానే సంబంధిత వైద్యసిబ్బందిని అప్రమత్తం చేసి, సమీప దవాఖానలకు పంపించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా దవాఖానలు, పది అర్బన్‌ సెంటర్లు, ఎనిమిది కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో నమోదవుతున్న వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 60 డెంగీ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం వ్యాధిగ్రస్తులు కోలుకుంటున్నారని, ఎవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు. సీజనల్‌ వ్యాధులకు సరిపడా మందులు ఉన్నాయని డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా సీజనల్‌ ఇబ్బందులతో రోజుకు వందల సంఖ్యలో ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇందూరులో శుభ్రత కరువు..

వానకాలం ప్రారంభం కావడంతో పరిసరాలు శుభ్రంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ నిజామాబాద్‌ నగరంలో మాత్రం శుభ్రత కరువైంది. మున్సిపల్‌ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణ తూతూ మంత్రంగా చేపడుతున్నారు. ప్రతి డివిజన్‌లో దుర్గంధం వెదజల్లుతున్నది. సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో ఫాగింగ్‌ మిషన్లతో ప్రతి డివిజన్‌లో పిచికారీ చేయాల్సి ఉండగా.. ఆ ఫాగింగ్‌ మిషన్లు కనుమరుగయ్యాయి. దీంతో దోమల తీవ్రత ఎక్కువై డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి.

ప్రభుత్వ దవాఖానలో అన్నిసౌకర్యాలు..

ప్రభుత్వ దవాఖానలో నిరంతరం వైద్యసేవలందిసు న్నాం. వైద్యులందరూ అందుబాటులో ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని సౌకర్యాలు ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉన్నా యి.

-ప్రతిమారాజ్‌, ప్రభుత్వ దవాఖాన సూపరిటెండెంట్‌

అప్రమత్తంగా ఉండాలి..

ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. నిత్యం చేతులు శుభ్రపరుచుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. అప్రమత్తంగా ఉంటేనే రోగాలు రావు. వాతావరణ మార్పులతో వైరల్‌ ఫీవర్‌ విస్తరిస్తుంది. కాచి వడబోసిన నీటిని తీసుకోవడం ఉత్తమం. వైద్యశాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

– తుకారాం రాథోడ్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

2024-06-30T20:44:48Z dg43tfdfdgfd