VIJAYAWADA: ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి నవరాత్రులు.. ప్రత్యేకత ఇదే

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మొదటిసారిగా వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు ఆదివారం నాడు వెల్లడించారు. జులై 6న ఆషాడం మొదలవుతుందని, నెలరోజులపాటు ఆలయంలో ఆషాడమాస సారె మహోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పణకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.

ఇక, జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ.. అమ్మవారికి బోనాలు సమర్పిస్తుందని పేర్కొన్నారు. జులై 19 నుంచి మూడు రోజులపాటు శాకాంబరీ దేవి ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్‌ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు ఉండవన్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు.

నవరాత్రుల్లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం వారాహిదేవికి అర్చనలు నిర్వహిస్తారు. చివరి రోజున వారాహి హోమం, పూర్ణాహుతి జరుగుతాయి. ఇక, లలితాదేవి స్వరూపమైన వారాహీ అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుందని అంటారు. వారాహీదేవిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి, శత్రునాశనం. వారాహీ అమ్మవారు సస్య దేవత కావడంతో ఈ తొమ్మిది రోజులు అమ్మవారు చిత్రపటాన్ని పొలం ఉంచి పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని నమ్మకం. అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇక, జ్యేష్ఠ మాసం చివరిలో అమ్మవారి దీక్షను చేపడతారు. నవరాత్రుల వేళ ఎలాంటి నియమాలు పాటిస్తారో.. వారాహి నవరాత్రుల్లోనూ అలాగే కఠినంగా దీక్ష చేస్తారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-30T15:36:35Z dg43tfdfdgfd