బేరియాట్రిక్ సర్జరీ: బరువు తగ్గించుకునే ఆపరేషన్‌తో యువకుడి మృతి, అసలేం జరిగింది?

బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న ఒక యువకుడు మృతి చెందడంతో ఇలాంటి చికిత్సలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

పుదుచ్చేరికి చెందిన 26 ఏళ్ల హేమచంద్రన్ 142 కేజీల బరువు ఉండేవారు. చెన్నైలోని క్రోమ్‌పేటైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్ ఈ సర్జరీ చేయడం కోసం ఆయన్ను మరో ఆసుపత్రికి వెళ్లారు.

‘‘చికిత్స కోసం లోపలికి తీసుకెళ్లిన నిమిషాల వ్యవధిలోనే అతని బీపీ పడిపోయిందని అంబులెన్స్‌ను పిలిపించి క్రోమ్‌పేటైలోని మరో ఆసుపత్రికి తరలించారు. అందులో చేర్చిన తర్వాత, మా అబ్బాయిని వెంటిలేటర్ మీద ఉంచినట్లు మాకు చెప్పారు. కాసేపటికే అతను చనిపోయాడని అన్నారు’’ అని హేమచంద్రన్ తండ్రి సెల్వనాథన్ తెలిపారు.

ఆ యువకుని మరణానికి కారణాలను నిర్ధరించేందుకు ఇద్దరు కో డైరెక్టర్లతో కూడిన ఒక కమిటీని తమిళనాడు ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది.

బరువు తగ్గించే శస్త్రచికిత్స ఎలా చేస్తారు?

బేరియాట్రిక్ సర్జరీలో అన్నవాహిక, పొట్ట పరిమాణాన్ని తగ్గిస్తారు. ఈ సర్జరీ తర్వాత పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోలేరు. కొంతమందికి అన్నవాహిక శాశ్వతంగా కుచించుకుపోగా, మరికొంతమందిలో తాత్కాలికంగా ఇలా జరుగుతుంది. ఈ సర్జరీ జరిగిన వెంటనే బరువు తగ్గరు.

ఈ సర్జరీ తర్వాత ఆహారం తీసుకోవడం తగ్గిపోవడం, వ్యాయామాల కారణంగా క్రమంగా శరీర బరువు తగ్గుతుంటుంది. శరీరంలో మార్పులు కనిపించడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జన్లు ఈ చికిత్సను చేస్తారు.

ఈ సర్జరీ గురించి చెన్నైకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ రవీంద్ర కుమారన్ బీబీసీకి వివరించారు.

కోత ద్వారా చేసే సర్జరీ అయినప్పటికీ ఇది మామూలు చికిత్స కాదని ఆయన అన్నారు. ఆపరేషన్ లేకుండా బరువు తగ్గేందుకు ప్రయత్నించి ఉండాలని, కానీ అతను అలా చేయలేకపోయాడని డాక్టర్ రవీంద్ర కుమారన్ అన్నారు.

‘‘సర్జరీకి ముందు మానసిక వైద్యుడిని సంప్రదించాలి. ఒక డయాబెటాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్‌ల అవసరం 100 శాతం ఉంటుంది. ఒబేసిటీ ఉన్నవారికి ఏ సర్జరీ అయినా చాలా ప్రమాదకరం. రోగి శరీరంలో ట్యూబ్‌ను అమర్చడం, రోగిని మరో బెడ్ మీదకు మార్చడం వంటివి పెద్ద సవాలు. ఏ సమయంలోనైనా పొరపాట్లు జరగొచ్చు’’ అని ఆయన వివరించారు.

‘‘తేలికైన ఆపరేషన్ అని చెప్పి..’’

హేమచంద్రన్ తండ్రి సెల్వనాథన్ బీబీసీతో మాట్లాడారు. ‘‘మా అబ్బాయి యూట్యూబ్‌లో డాక్టర్ వీడియోలు చూశాడు. తాను కూడా అలాగే ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నాడు. గతేడాది మేం పుదుచ్చేరి నుంచి వచ్చి క్రోమ్‌పేటై‌లోని ఆ డాక్టర్‌ను వ్యక్తిగతంగా కలిశాం. ఆపరేషన్ చేసి పొత్తికడుపును ఎలా కుదిస్తారో ఆయన ఒక పేపర్ మీద గీసి చూపించారు. ఇది చాలా తేలికైన ఆపరేషన్, భయపడాల్సిన పనే లేదని చెప్పాడు.

మేం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన అసిస్టెంట్ ఒకరు ఫోన్ చేసి మీరెప్పుడు సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నారు అని అడిగారు. అప్పటినుంచి మా అబ్బాయికి తరచుగా ఆ ఆసుపత్రి నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. పోయిన నెల మేం మరోసారి డాక్టర్‌ను మళ్లీ కలిశాం.

ఏప్రిల్ 22న సర్జరీ చేయాలని నిర్ణయించారు. అదే ఆసుపత్రిలో సర్జరీకి సంబంధించిన ఇతర పరీక్షలు చేశారు. మా అబ్బాయికి డయాబెటిస్ ఉంది. అందుకే అతనికి ఇన్సులిన్ ఇవ్వమని డయాబెటాలజిస్ట్ చెప్పారు. కానీ, సర్జన్ మాత్రమ ఇన్సులిన్ వద్దని అన్నారు.

హార్ట్ సర్జన్ సలహా కూడా తీసుకున్నాం. మాకైతే చివరి వరకు మత్తుమందు ఇచ్చే వైద్యుడు కనబడలేదు. క్రోమ్‌పేటై ఆసుపత్రిలో ఆపరేషన్ ఖర్చు రూ. 8 లక్షలు అవుతుంది. అదే సర్జరీ పమ్మల్‌లోని మరో ఆసుపత్రిలో అదే డాక్టర్ చేస్తే రూ. 4 లక్షలే ఖర్చు అవుతుందని చెప్పారు. అందుకే ఈనెల 21న మా అబ్బాయి పమ్మల్‌లోని ఆసుపత్రిలో చేరాడు’’ అని ఆయన వివరించారు.

తమిళనాడు మంత్రి ఏమన్నారు?

తమిళనాడు వైద్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ఫోన్‌లో హేమచంద్రన్ తల్లిదండ్రులతో మాట్లాడారు. హేమచంద్రన్ మృతికి కారణాలపై విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఒక వ్యక్తి ఎత్తుకు తగిన బరువు ఉన్నాడో లేదో అనే సంగతిని బీఎంఐ ద్వారా కొలుస్తారు. ఒక వ్యక్తి బీఎంఐ 35-40 మధ్య ఉంటే అతనికి బరువు తగ్గే శస్త్రచికిత్స అవసరం అని భావిస్తారు.

ఇప్పటికే బరువు తగ్గే శస్త్రచికిత్స చేయించుకున్నవారు ఎలా ఉన్నారు?

చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే పురుషోత్తం వయస్సు 30 ఏళ్లు. ఆరేళ్ల క్రితం ఆయన బరువు తగ్గించే శస్త్రచికిత్స ద్వారా చాలా బరువు తగ్గారు.

‘‘నాకు 24 ఏళ్లున్నప్పుడు నా బరువు 143 కేజీలు ఉండేది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండేది. నడిస్తే కూడా ఆయాసం వచ్చేది. మెట్లు ఎక్కలేకపోయేవాడిని. మా ఇంట్లో నాకు తగినట్లుగా అన్ని సౌకర్యాలు ఉండేవి. కాబట్టి ఇల్లు తప్పా ఇంకెక్కడైనా నాకు ఇబ్బందిగా ఉండేది. అధిక బరువుతో భవిష్యత్‌లో గుండెజబ్బులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ’’ అని ఆయన చెప్పారు.

చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బరువు తగ్గించే శస్త్రచికిత్స చేసిన ఆరు నెల తర్వాత ఆయన బరువు 77 కేజీలకు పడిపోయింది.

‘‘సర్జరీ కంటే ముందు అయిదు కిలోల బరువు తగ్గాలని డాక్టర్ చెప్పారు. నేను మూడు కిలోల వరకు బరువు తగ్గగలిగాను. సర్జరీ కంటే ముందు ఒకేసారి నేను 10 ఇడ్లీలు తినేవాడిని. శస్త్రచికిత్స తర్వాత ఒకేసారి రెండు ఇడ్లీల కంటే ఎక్కువ తినలేరు.

మధ్య మధ్యలో ఖాళీ ఇస్తూ ఆహారం తీసుకునేవాడిని. తీసుకునే ఆహార పరిమాణం తగ్గిపోవడంతో కేవలం పౌష్టికాహారం మీదే దృష్టిపెట్టాను. ఇప్పుడు నా శరీరంలో కొవ్వు సరైన స్థాయిలో ఉంది. నా వైవాహిక జీవితం కూడా బాగుంది’’ అని ఆయన చెప్పారు.

‘‘లైపోసక్షన్ కాదు’’

ఈ సర్జరీని కొన్నిసార్లు లైపోసక్షన్‌గా పొరబడుతుంటారు. లైపోసక్షన్ అనేది శరీరంలోని కొవ్వును వెంటనే తొలగించే ప్రక్రియ. ఈ లైపోసక్షన్ ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. ఈ ప్రక్రియలో పొట్టభాగం, తొడలు, కొన్నిసార్లు చేతుల నుంచి కొవ్వును తొలగిస్తారు.

ఈ శస్త్రచికిత్స గురించి చెన్నైకి చెందిన ప్లాస్టిక్ సర్జన్ రమాదేవితో బీబీసీ మాట్లాడింది.

‘‘ఒక వ్యక్తి అధిక బరువు ఉంటే ముందుగా వెయిట్‌లాస్ సర్జరీ చేయించుకోవచ్చు. తర్వాత అవసరమైతే లైపోసక్షన్ చికిత్స కూడా చేయించుకోవచ్చు. దశల వారీగా కొవ్వును తొలగించడం కంటే, ఒకేసారి కొవ్వును తీసేయడం అనవసర సమస్యలు రాకుండా చేస్తుంది.

బేరియాట్రిక్ సర్జరీ సమయంలో శరీరం మొద్దుబారేలా చేయడానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. సరైన పరిమాణంలో మత్తు ఇవ్వకపోతే ఈ చికిత్స వల్ల ప్రాణాల మీదకు రావొచ్చు.

లైపోసక్షన్ చికిత్స చేసేటప్పుడు శరీరంలోకి అడ్రినలిన్ కలిపిన ద్రవాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఈ ద్రవం ఎక్కువగా పంపిస్తే అది గుండెపై ప్రభావం చూపుతుంది. హార్ట్ అటాక్ రావొచ్చు.

ఇప్పటికే గుండెకు సంబంధించిన సమస్యలతో ఉన్నవారికి ఇది అదనపు ప్రమాదాన్ని పెంచుతుంది. కొంతమందికి అలెర్జీలు రావొచ్చు. ఇవి కూడా ప్రాణాంతకంగా మారతాయి’’ అని ఆమె వివరించారు.

తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రకమైన సేవలు అందుబాటులో ఉండవు. ఈ రకమైన చికిత్సల కోసం దాదాపు రూ. 2 నుంచి రూ. 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-26T14:00:51Z dg43tfdfdgfd