TELUGU STUDENT DIES IN USA : అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ!

Telugu Student Dies In USA : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించాడు. హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుమార్ రాజ్ చికాగో మిస్సౌరీ ప్రాంతంలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో యువకుడు గల్లంతు ఘటనలో తెలంగాణకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రాజు శ్రీనాథరాజు (20) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చికాగోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.

ఈత రాకపోవడంతో

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. కిరణ్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గత ఏడాది నవంబర్ లో అమెరికా వెళ్లాడు. జూన్ 28న మిస్సౌరీలోని సాండ్ హిల్ టౌన్ సమీపంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ కొలనులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కిరణ్ నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలించలేదు. కిరణ్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల కిరణ్ కుమార్ రాజు తాను Dev Opsలో సర్టిఫికేషన్ పూర్తి చేసినట్లు తన లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఘోరప్రమాదం చోటుచేసుకుంది.

గతంలో తండ్రి మృతి

కిరణ్ కుమార్ రాజు అకాల మరణంతో అతడి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కిరణ్ తండ్రి లక్ష్మణ్ రాజు గతంలో మరణించగా, తల్లి హైదరాబాద్‌లో నివాసిస్తున్నారు. కిరణ్ తాత కృష్ణమూర్తి రాజు యువకుడి చదువుకు సహకరిస్తున్నారు. కిరణ్ సెయింట్ లూయిస్‌లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతడు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చికాగోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. కిరణ్ బంధువులతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. ఈ కష్ట సమయంలో అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నట్లు పేర్కొంది.

అమెరికాలో కాల్పులు-తెలుగు యువకుడు మృతి

అమెరికాలో ఇటీవల జ‌రిగిన‌ కాల్పుల్లో ఏపీకి చెందిన యువ‌కుడు మృతి చెందారు. బాప‌ట్ల జిల్లా క‌ర్లపాలెం మండ‌లం యాజ‌లి గ్రామానికి చెందిన దాస‌రి గోపీకృష్ణ (32) అమెరికాలోని దుండ‌గుడి కాల్పుల్లో మ‌ర‌ణించాడు. గోపీకృష్ణ జీవ‌నోపాధి కోసం ఎనిమిది నెల‌ల క్రితం అమెరికా వెళ్లాడు. అమెరికాలోని అర్కెన్సాస్ రాష్ట్రంలోని సూప‌ర్ మార్కెట్లో ప‌నిచేస్తున్నాడు. శ‌నివారం మ‌ధ్యాహ్నం గోపీకృష్ణ కౌంట‌ర్‌లో ఉండ‌గా, ఓ దుండ‌గుడు నేరుగా వ‌చ్చి తుపాకీతో అత‌డిపై కాల్పులు జ‌రిపాడు. దీంతో తీవ్రగాయాల‌తో గోపీకృష్ణ అక్కడిక‌క్కడే కుప్పకూలిపోయాడు. అనంత‌రం దుండగుడు ఓ వ‌స్తువు తీసుకుని అక్కడి నుంచి ప‌రార‌య్యాడు. వెంట‌నే గోపీకృష్ణను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉద‌యం చ‌నిపోయాడు. ఈ స‌మాచారం తెలియ‌డంతో గోపీకృష్ణ కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. గోపీకృష్ణకి భార్య, కుమారుడు ఉన్నారు.

2024-07-01T09:02:07Z dg43tfdfdgfd