కవితాకాశంలో ఇద్దరూ ఇద్దరే

సాహిత్యాభిమానులు శ్రీశ్రీగా పిలుచుకొనే శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి.. వీరిద్దరూ ఆధునిక కవుల్లో ప్రసిద్ధి చెందినవారు. వీరివి విభిన్న దృక్పథాలు. ఒకరిది భావ కవిత్వం కాగా, మరొకరిది అభ్యుదయ కవిత్వం.

వ్యావహారిక భాషలో, లలితమైన పదాలతో, ప్రృకతితో మమేకమై పండిత పామరులను ఆహ్లాదపరిచేది ‘భావ కవిత్వం’. ‘రాబర్ట్‌ ఫ్రాస్ట్‌’, ‘విలియం వర్డ్స్‌ వర్త్‌’ వంటి కవుల కలాల నుంచి ఉద్భవించిన రొమాంటిక్‌ పోయెట్రీ, తెలుగు సాహిత్యంలో భావ కవిత్వమైంది.

తెలుగులో భావకవి అనగానే గుర్తుకొచ్చే కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. కవిత్వ భాషలో సౌందర్యాన్ని, సున్నిత భావోద్వేగాలను, ప్రకృతికీ, చెట్లకు, పూలకు, ఆకులకు, నీలి మేఘాలకు అన్వయిస్తూ, పాఠకుల మనసుల్లో మల్లెల మాలలూగించారు కృష్ణశాస్త్రి గారు. భావాంబర వీధిలో ఓలలాడించారు. ప్రకృతి అందాలకు పరవశించి ‘ఆకులో ఆకునై, పూవులో పూవునై’ అంటూ రాశారు. అలాగే ‘ఘనా ఘన సుందరా’ అంటూ భక్తి భావగీతాలు కూడా రాశారు.

ఆకు కదలికలకు పరవశం, గాలి సవ్వడికి తన్మయత్వం, మల్లె సౌరభానికి ఉప్పొంగిపోయే కవిత్వం మనకు అందించిన ‘ఆంధ్రా షెల్లీ’ కృష్ణశాస్త్రి గారు. ఆయన కవిత్వం ఎప్పుడు విన్నా, ఏదో తీయని లోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. ‘మనకు కీట్స్‌, షెల్లీ, వర్డ్స్‌వర్త్‌ వంటి కవులు లేరు. ఆ కవులు మన దేశంలో కృష్ణశాస్త్రిగా పుట్టినారని నా అభిప్రాయం’ అని అన్నారు కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు.

ఇక ‘కవిత్వం అంటే ఓ తీరని దాహం’ అన్నారు శ్రీశ్రీ. సాధించిన దానితో ఒకింత సంతోషం కలిగి, దానితో సంతృప్తి చెంది, అదే విజయం అనుకుంటే పొరపాటోయి’ అన్న శ్రీశ్రీ భావం అక్షర సత్యం. ప్రతి ఒక్క కవికీ ఒక మంత్రోపదేశం.

శ్రీశ్రీ తన 18వ ఏట ‘ప్రభవ’ అనే కావ్య సంపుటిని సాంప్రదాయ పద్ధతిలో రాశారు. తర్వాతి కాలంలో గ్రాంథిక శైలి, చందస్సు, పక్కనపెట్టి వాడుక భాషలో గురజాడ అడుగుజాడల్లో రాయడం మొదలుపెట్టారు.

ప్రజాస్వామ్య భావాలను కవిత్వంలో ప్రవేశపెట్టారు శ్రీశ్రీ. మనిషి కేంద్ర బిందువుగా కవితాగానం చేశారు. విశ్వజనీన ప్రతీకలను బలంగా చెప్పడం వల్ల, శ్రీశ్రీ మహా కవిత్వమైన మహా ప్రస్థానం ప్రజల హృదయాల్లో శ్రీశ్రీ అనగానే గుర్తొచ్చేంతగా ముద్ర వేసుకుపోయింది. కవిత్వంలో ఒక కొత్త శైలినీ, అభ్యుదయ వాదాన్ని ప్రవేశపెట్టి, నేటి తరాన్ని ప్రభావితం చేశారు. ‘కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్ల’ కాదేదీ కవితకనర్హం’ అంటూ కవితా వస్తువును పరివ్యాప్తం చేసిన శ్రీశ్రీ ఎంతో మందిని కవిత్వం వైపు అడుగులు వేయించారు. ఒక ప్రత్యేకమైన ఒరవడి సృష్టించారు. శ్రీశ్రీ కవిత్వంలో అభ్యుదయ భావం ఎంత ఉందో సాంప్రదాయ కవిత్వ ప్రభావం కూడా అంతే ఉంది.

‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ’ అన్నారు చలం. భావాంబర వీధిలో విహరింపజేసి మనోల్లాసం కలిగించే కృష్ణశాస్త్రి గారి కవిత్వం, అభ్యుదయ పథంలో నడిపిస్తూ చైతన్యస్ఫూర్తి రగిలించే శ్రీశ్రీ కవిత్వం.. ఇద్దరి రచనలూ నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

డాక్టర్‌ కేతవరపు రాజ్యశ్రీ

85001 21990

2024-06-30T20:44:50Z dg43tfdfdgfd